DC vs RR : ఓడిపోయే మ్యాచ్‌లో గెలవడం పై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కామెంట్స్.. ఆ ఒక్కడి వల్లే ఇదంతా..
సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన తరువాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఓడిపోయే మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో తమను గెలిపించాడని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌ను నిర్వహించగా.. సూపర్ ఓవర్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 11 పరుగులే చేసింది. 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగో బంతికే ఛేదించింది.
అంతా బాగానే ఉంది, ముగింపు అదిరిపోయిందని అక్షర్ పటేల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అన్నాడు. ‘మేము మొదట బ్యాటింగ్ చేసే సమయంలో పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉందని భావించాము. కానీ తొలి టైమ్ ఔట్‌లో కేఎల్ రాహుల్, పోరెల్ లు పిచ్ బ్యాటింగ్‌కు కఠింనంగా ఉన్నట్లు చెప్పారు. 12,13వ ఓవర్‌లో మూమెంటమ్ లభించింది. ఆఖరికి మేం మంచి లక్ష్యాన్ని నిర్దేశించాము. కొత్త బ్యాటర్లు వేగంగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు.’ అని అక్షర్ పటేల్ తెలిపాడు.
లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు పవర్ ప్లేలో చాలా వేగంగా పరుగులు చేశారు. వెంటనే మేము టైమ్ ఔట్ తీసుకున్నాం. అప్పుడు మా ప్లేయర్లకు ఒక్కటే చెప్పాను. ఈ పిచ్ పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు. కాబట్టి కాస్త నమ్మకం ఉంచి వికెట్ తీసే ప్రయత్నం చేయాలని చెప్పాను. సెట్ బ్యాటర్ ఔటైనతరువాత కొన్ని వికెట్లు మాకు దక్కాయి. కొత్ల బ్యాటర్లు ఆందోళన పడ్డారు. ఫాస్ట్‌గా రన్స్ చేయాలన్న తొందరలో భారీ మూల్యం చెల్లించుకున్నారు. అని అక్షర్ చెప్పాడు.
DC vs RR : ఢిల్లీ పై సూపర్ ఓవర్‌లో ఓటమి.. రాజస్థాన్ కెప్టెన్ సంజూశాంసన్ కీలక వ్యాఖ్యలు..
‘ఓ కెప్టెన్‌గా జట్టు విజయాల్లో భాగం కావాలని భావించాను. నా ఆత్మ విశ్వాసం ఎప్పుడూ సన్నగిల్లలేదు. నేను ఏమి చేయగలనో అని ఆలోచించాను. ఈ క్రమంలోనే ఆర్ఆర్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాను. ఇక ఆఖరి ఓవర్లలో స్టార్క్ మాత్రమే అద్భుతం బంతులు వేయగలడన్న నమ్మకం నాకు ఉంది. అతడి పై పూర్తి విశ్వాసం ఉంచాను. అతడు 12 బంతులకు 12 యార్కర్లు వేశాడు. అందుకనే అతడు ఓ లెజెండ్ ఆటగాడు. అతడి బౌలింగ్‌తో మేం మ్యాచ్ గెలిచాం.’ అని అక్షర్ పటేల్ తెలిపాడు. ఇక గత మ్యాచ్‌లో ఓడిపోవడం కలిసి వచ్చిందన్నాడు.