DC vs RR : మ్యాచ్‌లో దీన్ని గమనించారా? ఔట్ కాకుండానే మైదానం వీడిన సంజూ శాంసన్.. ఓడిన రాజస్థాన్..!
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఈ సీజన్‌లో ఐదో ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. దీంతో ఆర్ఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇక నుంచి ఆర్ఆర్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిన కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే.
ఈ సీజన్‌లో రాజస్థాన్ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.714గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదితో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ మరో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది.
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49 పరుగులు ), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34 పరుగులు) రాణించారు. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు. మహేశ్ తీక్షణ, వనిందు హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో నితీశ్ రాణా (51; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (51; 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 11 పరుగలే చేసింది. 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగో బంతికే ఛేదించింది.
సంజూ శాంసన్ రిటైర్డ్ ఔట్..
ఈ మ్యాచ్ మధ్యలో సంజూ శాంసన్ ఔట్ కాకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రిటైర్డ్ ఔట్‌గా మైదానాన్ని వీడాడు.
DC vs RR : ఢిల్లీ పై సూపర్ ఓవర్‌లో ఓటమి.. రాజస్థాన్ కెప్టెన్ సంజూశాంసన్ కీలక వ్యాఖ్యలు..
లక్ష్య ఛేదనలో ఓపెనర్లు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరి ధాటికి ఆర్ఆర్ స్కోరు 5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. అప్పుడు ఊపు చూస్తే రాజస్థాన్ ఈజీగానే మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. అయితే.. 5.3ఓవర్‌లో సంజూ శాంసన్ క్రీజును వీడాలని నిర్ణయించుకున్నాడు.
ఈ బాల్ కంటే కొన్ని బంతుల ముందు అతడు బ్యాక్ ఫుట్ నుంచి లాంగ్ సిక్స్ బాదాడు. ఆ సమయంలో అతడికి వెన్ను నొప్పి వచ్చింది. వెన్నునొప్పి అధికం కావడంతో అతడు రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నాడు. రిటైర్డ్ ఔట్‌గా మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 19 బంతులను ఎదుర్కొన్నాడు. 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 31 పరుగులు చేశాడు.
ఇక మ్యాచ్ అనంతరం గాయం నుంచి సంజూ శాంసన్ మాట్లాడాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందన్నాడు. తాను మళ్లీ మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా లేనన్నాడు. రేపటికి నొప్పి ఎలా ఉంటుందో చూడాలన్నాడు.