DC vs RR : ఢిల్లీ పై సూపర్ ఓవర్‌లో ఓటమి.. రాజస్థాన్ కెప్టెన్ సంజూశాంసన్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీపై ఓటమి తరువాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Courtesy BCCI
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించింది. ఆఖరి బంతి వరకు ఇరు జట్లను విజయం దోబూచులాడింది. చివరి బంతికి మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (49; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ (38; 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టబ్స్ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (34; 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు )లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు. మహేశ్ తీక్షణ, వనిందు హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో నితీశ్ రాణా (51; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (51; 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 11 పరుగలే చేసింది. 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగో బంతికే ఛేదించింది. చివరి సారిగా 2021లో ఐపీఎల్‌లో సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీనే గెలవడం విశేషం. నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పై ఢిల్లీ విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిపోవడం పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూశాంసన్ స్పందించాడు. ఆర్ఆర్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ జట్టును ఇబ్బందులకు గురి చేశారని.. ఇందుకు బౌలర్లు, ఫీల్డర్లకు క్రెడిట్ ఇవ్వాలన్నారు.
‘మా బ్యాటింగ్ లైనప్ బట్టి చూస్తే 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చునని అనిపించింది. పవర్ ప్లేలో మేము ఆడిన విధానంతో ఈ లక్ష్యాన్ని చేధిస్తామని భావించాను. కానీ మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో అతడు ఒకడు. అందుకనే అతడికి క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నా. సందీప్ శర్మ గత కొన్నేళ్లుగా మాకు అత్యంత కీలకమైన బౌలర్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అయితే.. స్టార్క్ మాకు విజయాన్ని దూరం చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే డ్రెస్సింగ్ రూమ్‌లో కొంత సానుకూల వాతావరణం ఉండేది.’ అని సంజూ శాంసన్ తెలిపాడు.
Rohit Sharma : రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..
ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది ఐదో ఓటమి కాగా.. వరుసగా మూడో ఓటమి కావడం విశేషం.