KL Rahul : ఆ రోజు చిన్నస్వామి స్టేడియంలో ఏం జరిగింది..? కేఎల్ రాహుల్ విధ్వంసాన్ని కేజీఎఫ్ స్టైల్‌లో.. వీడియో అదుర్స్..
రాయల్ ఛాలెంజర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు.

PIC CREDIT @DC twitter
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడు కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +1.278గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఫిల్‌సాల్ట్ (17 బంతుల్లో 37 పరుగులు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లీ (22), రజత్ పాటిదార్ (25)లు ఫర్వాలేదనిపించారు. పడిక్కల్ (1), లియామ్ లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ(3) లు విఫలం అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) బెంగళూరు స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు. తన హోం గ్రౌండ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ట్రిస్టన్ స్టబ్స్(38 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్లు) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. యశ్ దయాల్, సుయాష్ శర్మఓ వికెట్ సాధించాడు.
కేజీఎఫ్ స్ట్రైల్‌లో…
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ నటుడు యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కేజీఎఫ్ చిత్రం తొలి భాగంగా హీరో ఇంట్రడక్షన్ సీన్‌ను గురించి ఎంత చెప్పిన తక్కువ. హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ చెప్పిన ఆ సీన్‌ను అభిమానులు అంత త్వరగా మరిచిపోరు.
Good morning KLR nation 💙❤️ pic.twitter.com/rJDwArB75H
— Delhi Capitals (@DelhiCapitals) April 11, 2025
చిన్నస్వామి స్టేడియంలో కేఎల్ రాహుల్ విధ్వంసాన్ని వెల్లడించే విధంగా ఆ సీన్‌ను ఎడిట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. గుడ్ మార్నింగ్ కేఎల్ఆర్ నేషన్ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో.. ఆ రోజు చిన్నస్వామి స్టేడియంలో ఏం జరిగింది అని అంటూ.. కేఎల్ రాహుల్ షాట్లను చూపించారు. మొత్తంగా ఈ వీడియో అదిరిపోయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.