RCB vs CSK : చెన్నైతో ఆర్‌సీబీ మ్యాచ్.. అరుదైన ఘనతపై విరాట్ కోహ్లీ కన్ను..
శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపైనే ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకునే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 51 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ఈ క్రమంలో అతడు డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొడతాడు. పంజాబ్ కింగ్స్ పై డేవిడ్ వార్నర్ 26 మ్యాచ్‌ల్లో 1134 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ పై 34 మ్యాచ్‌ల్లో 1084 పరుగులు సాధించాడు.
అంతేకాదండోయ్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై 1130 పరుగులు, పంజాబ్ కింగ్స్ పై 1104 పరుగులను సాధించాడు కోహ్లీ. ఐపీఎల్‌లో మూడు వేరు వేరు జట్ల పై 1000 పరుగులు సాధించిన ఒకే ఒక ఆటగాడిగానూ నిలిచాడు.
ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
డేవిడ్ వార్నర్ – 1134 పరుగులు (పంజాబ్ కింగ్స్‌పై)
విరాట్ కోహ్లీ – 1130 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్‌పై)
విరాట్ కోహ్లీ – 1104 పరుగులు (పంజాబ్ కింగ్స్ పై)
డేవిడ్ వార్నర్ – 1093 పరుగులు (కోల్‌కతా నైట్‌రైడర్స్ పై)
విరాట్ కోహ్లీ – 1084 పరుగులు (చెన్నై సూపర్ కింగ్స్‌పై)
రోహిత్ శర్మ – 1083 పరుగులు (కోల్‌కతానైట్‌రైడర్స్ పై)
ఇక ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 63.29 సగటుతో 443 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్‌సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు.
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ సైతం అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 10 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.521గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై పై విజయం సాధిస్తే.. రెండో స్థానానికి చేరుకుంటుంది.