GT vs LSG : లక్నో పై ఓటమి.. గుజరాత్ కెప్టెన్ గిల్ కామెంట్స్.. ప్లేఆఫ్స్‌కు ముందు..
గుజరాత్ టైటాన్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ షాకిచ్చింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన తరువాత లక్నో సూపర్ జెయింట్స్ జూలు విదిల్చింది. మరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావించిన గుజరాత్ టైటాన్స్‌కు గట్టి షాక్ ఇచ్చింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ పై లక్నో 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రిషబ్ పంత్ (16; 6 బంతుల్లో 2 సిక్సర్లు) లు దంచికొట్టారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్, అర్షద్ ఖాన్‌లు చెరో వికెట సాధించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో షారుక్ ఖాన్ (57; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (35; 20 బంతుల్లో 7 ఫోర్లు), జోస్ బట్లర్ (33; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (38; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు మెరుపులు మెరిపించినప్పటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులకే గుజరాత్ పరిమితమైంది. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్క్ మూడు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆకాష్ మహారాజ్ సింగ్, షాబాజ్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ఓటమి పై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ స్పందించాడు. ఓటమి కాస్త నిరాశపరిచిందన్నాడు. అయినప్పటికి తాము అద్భుతంగా పోరాడమని చెప్పాడు. నిజం చెప్పాలంటే తాము 15 నుంచి 20 పరుగులు అదనంగా ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. 210 పరుగుకే లక్నోను కట్టడి చేస్తే ఫలితం మరో రకంగా ఉండేదన్నారు.
RCB : ప్లేఆఫ్స్‌కు ముందు గుడ్‌న్యూస్.. ఆర్‌సీబీ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..
వికెట్ల తీయకున్నా కూడా పవర్ ప్లేలో తమ బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేశారని మెచ్చుకున్నాడు. అయితే.. ఆ తరువాత బౌలర్లు గాడితప్పారని చెప్పాడు. మిగిలిన 14 ఓవర్లలో లక్నో 180 పరుగులు సాధించిందని చెప్పాడు. ఇక లక్ష్య ఛేదనలో తాము 17వ ఓవర్ వరకు మ్యాచ్‌లో ఉన్నామని తెలిపాడు. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదన్నాడు. అయితే.. మ్యాచ్ ఓడిపోయినప్పటికి తమకు సానుకూల అంశాలు చాలా ఉన్నాయని చెప్పాడు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ పెద్ద ప్లస్ అని అన్నాడు. ప్లే ఆఫ్స్ ముందు తిరిగి విజయాల బాట పట్టడం కీలకమని గిల్ అన్నాడు.