IPL 2026 Mini Auction: ఐపీఎల్ మినీ వేలానికి ముందు 9 మంది ప్లేయర్లు ఔట్
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో అందరి కళ్లు ఉన్నది మాత్రం విదేశీ ప్లేయర్ల మీదే. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మీద అందరి దృష్టి ఉంది, వెంకటేష్ అయ్యర్ మీద కూడా కొంత ఆశ ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ ఆక్షన్ కు సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 16వ తేదీ దుబాయ్ వేదికగా ఈవెంట్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆక్షన్ ప్రారంభం అవుతుంది. అయితే, ఆక్షన్ కి కొన్ని గంటల ముందు సంచలనం చోటుచేసుకుంది. 9 మంది ప్లేయర్లను మినీ ఆక్షన్ నుంచి తొలగించారు. ఇందులో ఆరుగురు భారత ప్లేయర్ల ఉన్నారు. ముగ్గురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. చివరి నిమిషంలో ఎంట్రీ కారణంగా వీరిని తప్పించినట్టు తెలుస్తోంది. ఆక్షన్ నుంచి తొలగించిన వారిలో మణిశంకర్ మురాసింగ్, చామా మిలింద్, కేఎల్ శ్రీజిత్, స్వస్తిక్ చికారా, విరాట్ సింగ్, రాహుల్ రాజ్ నమల ఉన్నారు. ఇక విదేశీయుల్లో మలేసియా ఆల్ రౌండర్ వీరన్ దీప్ సింగ్, సౌతాఫ్రికా ప్లేయర్ ఈథన్ బాష్, ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ గ్రీక్ ఉన్నారు.
ఐపీఎల్ మినీ వేలం కాబట్టి భారీ సంచలనాలు నమోదయ్యే అవకాశాలు తక్కువే. కానీ కేకేఆర్ దగ్గర భారీ బడ్జెట్ ఉంది. దీంతో ఏదైనా జరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో అందరి కళ్లు ఉన్నది మాత్రం విదేశీ ప్లేయర్ల మీదే. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మీద అందరి దృష్టి ఉంది. సూపర్ హిట్టర్ గా పేరుపొందిన మిల్లర్ చివరి నిమింషంలో వండర్స్ చేయగలడు. చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తాడు. కొన్నాళ్ల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుండడంతో మిల్లర్ ను ఎగరేసుకుపోయేందుకు ఫ్రాంచైజీలు చూస్తాయి. ఆండ్రూ రస్సెల్ రిటైర్ కావడంతో ఆ ప్లేస్ ని మిల్లర్ తో భర్తీ చేయాలని కేకేఆర్ చూసే చాన్స్ ఉంది ఈసారి మినీ ఆక్షన్ లో టాప్ 3 ప్లేయర్లలో మిల్లర్ కచ్చితంగా ఉండే చాన్స్ ఉంది.
వెంకటేష్ అయ్యర్ మీద కూడా కొంత ఆశ ఉంది. కేకేఆర్ అతడిని రిలీజ్ చేసినా కూడా మళ్లీ వేలంలో దక్కించుకునే అవకాశం ఉంది. అయ్యర్ ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. ఓపెనింగ్ ఆడగలడు. మిడిల్ ఆర్డర్ లోనూ రాణిస్తాడు. అవసరమైతే గేమ్ ఫినిషర్ గా కూడా రాణించే సత్తా వెంకటేష్ అయ్యర్ దగ్గర ఉంది. 2024 మెగా ఆక్షన్ లో కేకేఆర్ అత్యధికంగా 23.75 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే, అతడు ఆ స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. అందుకే వదిలేసింది. కానీ, తక్కువ ధరకు మళ్లీ తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
