Kapil Dev : టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌పై క‌పిల్ దేవ్ కామెంట్స్‌.. సాయం కోసం రారు.. వారికి మా అవ‌స‌రం లేదు

Kapil Dev comments : భార‌త్ దేశంలో క్రికెట్ అంటే ఓ ఆట కాదు.. ఓ మ‌తంలా భావిస్తారు. ఇంత‌లా దేశంలో క్రికెట్‌ను ఆద‌రించ‌డానికి 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యం అంటే అతిశ‌యోక్తి కాదేమో.

Kapil Dev : టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌పై క‌పిల్ దేవ్ కామెంట్స్‌.. సాయం కోసం రారు.. వారికి మా అవ‌స‌రం లేదు

Kapil Dev

భార‌త్ దేశంలో క్రికెట్ అంటే ఓ ఆట కాదు.. ఓ మ‌తంలా భావిస్తారు. ఇంత‌లా దేశంలో క్రికెట్‌ను ఆద‌రించ‌డానికి 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యం అంటే అతిశ‌యోక్తి కాదేమో. క‌పిల్ దేవ్ సార‌థ్యంలో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు అప్ప‌ట్లో ఆర‌వీర‌భ‌యంక‌ర‌మైన వెస్టిండీస్ జ‌ట్టును ఓడించి మొద‌టి సారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ఈ విజ‌యం భార‌త క్రికెట్ గ‌తినే మార్చేసింది. టీమ్ఇండియా ఎన్ని ప్ర‌పంచ‌క‌ప్‌లు గెలిచిన‌ప్ప‌టికీ భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో క‌పిల్ సేన సాధించిన విజ‌యం చిర‌స్థాయిలో నిలిచిపోతుంది.

తాజాగా.. ఓ క్రీడా ఛాన‌ల్‌తో క‌పిల్ మాట్లాడుతూ ప్ర‌స్తుత టీమ్ఇండియా ఆట‌గాళ్లలో చాలా మంది మాజీ క్రికెట్ల‌ర నుంచి ఎలాంటి సాయం కోర‌డం లేద‌న్నారు. అప్ప‌ట్లో మాజీ క్రికెట‌ర్ల నుంచి ఎన్నో స‌ల‌హాల‌ను తాము తీసుకునేవాళ్ల‌మ‌ని గుర్తు చేసుకున్నారు. తాను కూడా వారికి ఇలా ఆడండి, అలా ఆడండి అని ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు. ఒక‌వేళ ఏవ‌రైన త‌న సాయం కోసం వ‌స్తే మాత్రం చేస్తాన‌న్నారు. ఎవ్వ‌రినీ తాను బ‌ల‌వంతం చేయ‌న‌ని చెప్పారు.

ఇప్ప‌టి త‌రం పిల్లలు చాలా తెలివైన వారు. వారికి మ‌న‌లాంటి వారి అవ‌స‌రం లేదు. వారు బాగుప‌డేందుకు మాత్ర‌మే మ‌నం మార్గ‌నిర్దేశం చేయ‌గ‌ల‌ము. అంతే త‌ప్ప ఖ‌చ్చితంగా ఇలాగే చేయి అని చెప్పాల్సిన ప‌ని లేదు. గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడతారు. నెగెటివిటీని పట్టించుకోరన్నాడు.

బుమ్రా, ష‌మీల పై ప్ర‌శంస‌లు..

భార‌త బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌పై క‌పిల్ దేవ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓట‌మే లేకుండా సెమీ ఫైన‌ల్ చేర‌డంలో వీరి పాత్ర ఎంతో ఉంద‌న్నాడు. ష‌మీని తాను అసాధార‌ణ‌మైన ఆట‌గాడిగా భావిస్తాన‌ని చెప్పారు. ఇక బుమ్రా త‌న యాక్ష‌న్ తో ప్ర‌త్య‌ర్థుల‌ను హ‌డ‌లెత్తిస్తున్నాడు. అంత చిన్న ర‌న్న‌ప్‌తో అత‌నిలా ఎవ‌రైనా విధ్వంసం సృష్టిస్తార‌ని తాను క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌న్నాడు. ఈ ఇద్ద‌రికి అనుభ‌వం ఉంద‌ని, త‌మ‌ను తాము ఫిట్‌గా ఉంచుకోవాల‌ని క‌పిల్ ఈ పేస‌ర్ల‌కు సూచించారు.