Mohammad Kaif : ఫిబ్రవరి 23న టీమ్ఇండియా పై ప్రశంసల వర్షం.. మహ్మద్ కైఫ్ కామెంట్స్ వైరల్..
భారత జట్టు పై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

Mohammad Kaif on India debacle in Australia
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో మొదటి సారి భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు చేరుకోలేదు. ఇది మూడో డబ్ల్యూటీసీ సైకిల్ కాగా.. తొలి రెండు ఎడిషన్లలో భారత్ ఫైనల్ మ్యాచుల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక భారత జట్టు పై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ పై టీమ్ఇండియా గెలిస్తే అప్పడు భారత అభిమానులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యాన్ని మరిచిపోతారని చెప్పుకొచ్చాడు. అప్పుడు టీమ్ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తుందన్నాడు. అదే సమయంలో టెస్టుల్లో మెరుగైన ఫలితాలు సాధించకపోతే భారత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే జట్టుగా చూసే ప్రమాదం ఉందన్నాడు.
భారత జట్టు పై ఫిబ్రవరి 23న ప్రశంసల వర్షం కురవనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్థాన్ ఓడిస్తే అది జరుగుతుంది. అప్పుడు భారత్‌ను పరిమిత ఓవర్ల ఛాంపియన్‌గా పిలుస్తారు. కానీ భారత్ డబ్ల్యూటీసీ గదను సొంతం చేసుకోవాలంటే మాత్రం భారత క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌ను ఆడాలని సూచించాడు. సీమింగ్ ట్రాక్స్, స్పిన్ ట్రాక్‌లపై విపరీతంగా ప్రాక్టీస్ చేయాలన్నారు. దేశవాళీలో ప్రాక్టీస్ చేయకపోతే విజయం సాధించడం చాలా కష్టమన్నారు.
ఆసీస్ జట్టు చేతిలో ఓటమి ఓ మేలుకొలుపు కావాలన్నాడు. ఇది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక్కడి తప్పు కాదన్నారు. ప్రతి ఒక్క ఆటగాడు రంజీ ట్రోఫీలో ఆడేందుకు ప్రయత్నించాలన్నాడు. అయితే.. ఇప్పుడు కొందరు విశ్రాంతి పేరుతో రంజీల్లో ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. వాళ్లు రంజీలు ఆడరు. ప్రాక్టీస్ చేయరు. మరి వారి అత్యుత్తమ ప్రదర్శన ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు. ఇక నుంచైనా టెస్టు క్రికెట్ పై మరింత దృష్టి సారించాలి అని కైఫ్ అన్నాడు.
భారత్ ఈ ఏడాది జూన్‌లోనే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. అప్పటి వరకు వన్డేలు, టీ20లు మాత్రమే ఆడనుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్ నుంచే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ నాలుగో సైకిల్ ప్రారంభం కానుంది.