MS Dhoni : చెన్నై మ్యాచ్ ఓడిపోయినా.. చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఒకే ఒక సీఎస్‌కే ఆటగాడు
చెన్నై ఓడిపోయినప్పటి సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన ఘనత సాధించాడు.

pic credit @ csk
ఐపీఎల్ 2025 సీజన్‌లో శుక్రవారం చెన్నైలోని చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినప్పటికి సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. బెంగళూరు బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పాటీదార్ (51; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఫిల్ సాల్ట్ (32; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (27; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 నాటౌట్; 8 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, పతిరణ రెండు వికెట్లు సాధించాడు.
CSK vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ వింత వ్యాఖ్యలు.. సంతోషంగా ఉంది..
అనంతరం రచిన్ రవీంద్ర (41; 31 బంతుల్లో 5 ఫోర్లు), ఎంఎస్ ధోని (30 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0), దీపక్ హుడా (4), సామ్ కుర్రాన్ (8), రాహుల్ త్రిపాఠి (5)లు విఫలం అయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు, యశ్ దయాళ్, లియామ్ లివింగ్‌స్టన్ లు తలా రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ సాధించారు.
చరిత్ర సృష్టించిన ధోని..
సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ధోని 30 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు సురేశ్ రైనా ను అధిగమించాడు. 176 మ్యాచ్‌ల్లో రైనా 4687 పరుగులు చేయగా, ధోని 236 మ్యాచ్‌ల్లో 4699 పరుగులు సాధించాడు. వీరిద్దరి తరువాత డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు లు ఉన్నారు.
సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..
ఎంఎస్ ధోని – 4699 పరుగులు
సురేశ్ రైనా – 4687 పరుగులు
డుప్లెసిస్ – 2721 పరుగులు
రుతురాజ్ గైక్వాడ్ – 2433 పరుగులు
అంబటి రాయుడు – 1932 పరుగులు