రిటైర్‌మెంట్ హింట్ ఇచ్చిన ధోని? ‘కొత్త సీజన్-కొత్త పాత్ర‌’.. అంటూ పోస్ట్‌..

ఎంఎస్ ధోని సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

రిటైర్‌మెంట్ హింట్ ఇచ్చిన ధోని? ‘కొత్త సీజన్-కొత్త పాత్ర‌’.. అంటూ పోస్ట్‌..

MS Dhoni drops cryptic new season new role post ahead of IPL 2024

MS Dhoni Retirement : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సోష‌ల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. దీంతో అత‌డి రిటైర్‌మెంట్ అంశం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఐపీఎల్ 2023 సీజ‌నే మ‌హేంద్రుడికి చివ‌రిది అని ప్ర‌చారం జ‌రుగ‌గా ఆ సీజ‌న్ ముగిసిన త‌రువాత తాను మ‌రో సీజ‌న్ త‌ప్ప‌క ఆడ‌తాన‌ని ధోని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ‘కొత్త సీజన్-కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి.’ అని ధోని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.

దీంతో ధోని ఆట‌కు వీడ్కోలు చెప్ప‌నున్నాడా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ధోని కోచ్‌గా ఉంటాడ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ‘మీరు ఈ సీజ‌న్‌లో కోచింగ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను.’ అని ఒక‌రు, ‘కొత్త పాత్ర అంటే ఏమిటి? మీరు కూడా మెంటార్‌గా ప‌ని చేస్తారా?’ అని మ‌రొక‌రు ‘నేను ఖ‌చ్చితంగా అనుకుంటున్నాను. చెన్నై జ‌ట్టు కొత్త కెప్టెన్‌ను ప్ర‌క‌టించ‌బోతుంది.’ అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Ranji Trophy : ర‌హానే నాయ‌క‌త్వంలో అద‌ర‌గొట్టిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి..

ఐపీఎల్‌లో అత్య‌ధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్ల జాబితాలో రోహిత్‌శ‌ర్మ‌తో క‌లిసి ధోని అగ్ర‌స్థానంలో ఉన్నాడు. వీరిద్ద‌రు చెరో ఐదు సార్లు క‌ప్పును అందుకున్నారు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు ముంబై కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి రోహిత్‌ను త‌ప్పించి అత‌డి స్థానంలో హార్దిక్ పాండ్య‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ధోని ఈ సీజ‌న్‌లోనూ విజేత‌గా నిలిచి అత్య‌ధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా.. ధోని ఐపీఎల్ 2023 సీజ‌న్ ముగిసిన త‌రువాత త‌న మోకాలికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న మ‌హేంద్రుడు ఇటీవ‌లే ప్రాక్టీస్‌ను మొద‌లెట్టాడు. అయితే..ఇప్పుడు కొత్త పాత్ర అంటూ సోష‌ల్ మీడియాలో చెప్ప‌డంతో అదేమై ఉంటుందా? అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఐపీఎల్ ప్రారంభం నాటికి ఇందుకు సమాధానం దొర‌క‌నుంది.

Also Read : దీంతో కూడా ఆడొచ్చ‌ని అప్ప‌ట్లో తెలిసుంటేనా..? ఎప్పుడో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌ను అయ్యేవాడిని!

ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే కొత్త సీజన్‌కు ముందు సూపర్ స్టార్‌లు బెన్ స్టోక్స్, డ్వైన్ ప్రిటోరియస్, అంబటి రాయుడు, కైల్ జామీసన్‌లను విడుదల చేసింది. మినీ వేలంలో రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్‌లను రెహమాన్ (రూ. 2 కోట్లు), అవనీష్ రావు ఆరవెల్లి (రూ.20 లక్షలు) ల‌ను ద‌క్కించుకుంది.

ఐపీఎల్ 2024 సీజ‌న్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.