Team India : వామ్మో.. మీరేం ఆల్‌రౌండర్లురా బాబు.. ఒకరిని మించి మరొకరు.. మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు కొత్త తలనొప్పి..
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు కొత్త తలనొప్పి మొదలైంది.

New headache for team india ahead of 3rd test against England
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిపోయినా.. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ క్రమంలో జూలై 10 నుంచి 14 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని భారత్ భావిస్తోంది.
రెండో టెస్టులో విజయం సాధించినప్పటికి జట్టులో మార్పులు తప్పవనే విషయాన్ని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే వెల్లడించాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్టుకు విశ్రాంతినిచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో ఆడడం ఖాయం. ఈ విషయాన్ని ఇప్పటికే గిల్ చెప్పేశాడు. అదే సమయంలో జట్టులో ఇంకొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ENG vs IND : భారత భరతం పట్టాలని నిర్ణయించుకున్న ఇంగ్లాండ్.. కెప్టెన్, కోచ్ ఒకే మాట..!
శార్దూల్ ను కాదని నితీశ్‌ను తీసుకుంటే..
ఇంగ్లాండ్‌తో సిరీస్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటడడంతో పేస్ ఆల్‌రౌండర్‌గా ఆస్ట్రేలియాలో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డిని కాదని శార్దూల్ ఠాకూర్‌ను తొలి టెస్టుకు తీసుకున్నారు. అయితే.. శార్దూల్ ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్ 8 బంతుల్లో 1 పరుగు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 12 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు.
దీంతో రెండో టెస్టుకు శార్దూల్‌ను పక్కన బెట్టిన మేనేజ్‌మెంట్ నితీశ్‌కుమార్ రెడ్డికి చోటు ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఈ హైదరాబాదీ ఆటగాడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 బంతుల్లో 1 పరుగే చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు బంతులు ఆడి 1 పరుగే చేశాడు. ఇక బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అతడి చేతికి బంతినే ఇవ్వలేదు కెప్టెన్. ఈ మ్యాచ్‌లో నితీశ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.
ఈ క్రమంలో లార్డ్స్ టెస్టులో పేస్ ఆల్‌రౌండర్ కోటాలో ఎవరిని ఆడించాలోనని టీమ్‌మేనేజ్‌మెంట్ సందిగ్ధంలో పడింది. అటు శార్దూల్, ఇటు నితీశ్ కుమార్‌లు ఘోరంగా విఫలం కావడంతో జట్టుకు ఎం చేయాలో పాలుపోవడం లేదు. లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలం కావడంతో ముగ్గురు పేసర్లతో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరికి జట్టులో చోటు దక్కడం ఖాయం.
మరి నితీశ్‌కే అవకాశం ఇస్తారా? లేదంటే అనుభవానికి ఓటు వేసి శార్దూల్‌కు అవకాశం ఇస్తారా? అన్నది చూడాల్సిందే. లేక వీరిద్దరిని కాదని మరో ఆటగాడికి ఛాన్స్ ఇస్తారా ?అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా లార్డ్స్‌లో టీమ్ఇండియా తుది జట్లు కూర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మ్యాచ్ ప్రారంభం వరకు వెయిట్ చేయాల్సిందే.