పూరన్ పవర్ హిట్టింగ్‌.. టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ రికార్డ్ సమం, క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు

పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్.. పవర్ హిట్టింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సునామీ బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు.

పూరన్ పవర్ హిట్టింగ్‌.. టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ రికార్డ్ సమం, క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు

Nicholas Pooran equaled Yuvraj Singh long standing record for most runs in one over (Image: @ICC)

Nicholas Pooran T20I Records : పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్.. టీ20 ప్రపంచకప్‌లో రికార్డులు తిరగరాశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024లోనూ సత్తా చాటిన ఈ విండీస్ బ్యాటర్ తాజాగా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌ గ్రూప్ సీలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పవర్ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. పూరన్ సునామీ బ్యాటింగ్‌తో పలు రికార్డు బద్దలయ్యాయి.

వెస్టిండీస్ భారీ స్కోరు
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో విండీస్ సాధించిన హయ్యస్ట్ స్కోరు కూడా ఇదే. పూరన్ సునామీ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. బౌండరీలతో వీర బాదుడు బాదిన పూరన్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి.. సెంచరీకి 2 పరుగుల దూరంలో రనౌటయ్యాడు. ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.

ఒకే ఓవర్‌లో 36 పరుగులు
మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డును విండీస్ సమం చేసింది. పవర్‌ప్లేలో అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన నాలుగో ఓవర్‌లో విండీస్ ఏకంగా 36 పరుగులు చేసింది. ఈ ఓవర్‌లో పవర్ హిట్టింగ్‌తో పూరన్ చెలరేగిపోయాడు. 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. అజ్మతుల్లా నోబాల్ వేయడంతో దాన్ని బౌండరీకి తరలించాడు. వైడ్ బాల్‌తో మరో 5 పరుగులు వచ్చాయి. దీంతో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు సమం అయింది. మరొక్క పరుగు చేసివుంటే యువీ రికార్డ్ బ్రేక్ అయ్యేది.

క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన విండీస్ బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. 128 సిక్సర్లతో అతడు ముందున్నాడు. క్రిస్ గేల్ 124 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఎవిన్ లూయిస్(111), కీరన్ పొలార్డ్(99), రోవ్మాన్ పావెల్(90) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.