India vs Bangladesh : బంగ్లాతో భారత్ మ్యాచ్.. నాల్గో విజయం నమోదు చేస్తుందా? ఆ ప్లేయర్స్ తో జాగ్రత్త
వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా గురువారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు పుణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా వరుసగా నాల్గో మ్యాచ్ లోనూ విజయకేతనం ఎగురవేయాలని భారత్ భావిస్తుంది.

India vs Bangladesh
India vs Bangladesh ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా గురువారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు పుణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా వరుసగా నాల్గో మ్యాచ్ లోనూ విజయకేతనం ఎగురవేయాలని భారత్ భావిస్తుంది. భారత్ జట్టు ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలతో ఉత్సాహంలో ఉంది. బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లపై ఓటమిపాలైంది. అలాఅని, బంగ్లాదేశ్ జట్టుతో మ్యాచ్ అంటే అంతఈజీ కూడాకాదు. పుణెలో బంగ్లా నుంచి ప్రతిఘటనసైతం భారత్ జట్టుకు ఎదురుకావొచ్చు.
వీళ్లతో జాగ్రత్త..
బంగ్లాదేశ్ జట్టులో ప్రమాదకరమైన ఆటగాళ్లూ ఉన్నారు. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ప్రపంచ మేటి ఆల్ రౌండర్లలో ఒకడు. మరో స్పిన్ ఆల్ రౌండర్ మెహిదీ మిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫేస్ విభాగంలోనూ ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్, షోరిపుల్ లాంటి ప్రతిభావంతులు బంగ్లా జట్టులో ఉన్నారు. ముస్తాఫిజుర్ కు భారత్ మీద మంచి రికార్డుకూడా ఉంది. బ్యాటింగ్ లో ఆ జట్టుకు ముష్ఫికర్ రహీమ్ అత్యంత కీలకం. లిటన్ దాస్, నజ్ముల్ శాంటో కూడా రాణించగలరు. బంగ్లాదేశ్ జట్టుకు భారత్ పై రెండు వన్డే సిరీస్ లు నెగ్గిన ఘనత ఉంది. భారత్ ఆటగాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా బంగ్లాదేశ్ జట్టుపై పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.
భారత్ జట్టు ఎన్నిసార్లు గెలిచిందంటే..
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు 40 వన్డేల్లో తలపడ్డాయి. భారత్ జట్టు 31 విజయాలు సాధించగా.. బంగ్లాదేశ్ ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఎలాంటి ఫలితాలు రాలేదు. అయితే, చివర్లో భారత్ తో జరిగిన గత నాలుగు మ్యాచ్ లలో మూడు సార్లు బంగ్లాదేశ్ జట్టే గెలిచింది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇరు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇండియా మూడు సార్లు, బంగ్లాదేశ్ జట్టు ఒకసారి విజయం సాధించింది.
భారీ స్కోర్ ఖాయమా?
పుణె లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్ లో భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. చివరగా ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 300కుపైగా స్కోర్లు చేశాయి. పిచ్ స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది. అయితే, తొలుత భారత్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్ జట్టులో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ భీకర ఫామ్ లో ఉన్నాడు. గిల్ సైతం పాక్ తో మ్యాచ్ లో క్రీజులో ఉన్నంత సేపు పర్వాలేదనిపించాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, జడేజాల నుంచి భారీ స్కోర్లు ఆశించొచ్చు. వీరిలో ఏ ఇద్దరు క్రీజులో పాతుకుపోయినా భారత్ స్కోర్ ఈజీగా 300 దాటే అవకాశం ఉంది. అయితే, భారత్ జట్టులో మార్పులు ఏమైనా ఉంటాయా.. పాక్ తో మ్యాచ్ లో మైదానంలోకి దిగిన జట్టే ఫైనల్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
భారత్ జట్టు (అంచనా) ..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ మహ్మద్ షమీ.
బంగ్లాదేశ్ జట్టు (అంచనా) ..
లిట్టన్ దాస్, తాంజిద్ తమీమ్, మెహిది హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముషిఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.