IND w Vs PAK w : మునీబా అలీ వివాదాస్పద రనౌట్..! ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయ్..
భారత్, పాక్ మ్యాచ్‌లో (IND w Vs PAK w) పాక్ బ్యాటర్ మునీబా అలీ రనౌట్ వివాదాస్పదంగా మారింది.

ODI World Cup 2025 IND W vs PAK W Muneeba Ali Controversial Run Out
IND w Vs PAK w : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో (IND w Vs PAK w) భారత్ ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ మునీబా అలీ రనౌట్ (Muneeba Ali Run Out) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46), రిచా ఘోష్ (35 నాటౌట్), జెమీమా రోడిక్స్ (32), ప్రతీక రావల్ (31) రాణించారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు తీయగా.. ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ లు చెరో రెండు వికెట్లు సాధించారు.
248 పరుగుల లక్ష్యంతో పాక్ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను క్రాంతి గౌడ్ వేసింది. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని పాక్ బ్యాటర్ మునీబా అలీ ఎదుర్కొంది. అయితే.. బ్యాట్‌ను మిస్సైన బంతి మునీబా ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూ అంటూ భారత ఫీల్డర్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని చెప్పాడు. అదే సమయంలో భారత ఫీల్డర్ దీప్తీ శర్మ బంతిని నేరుగా వికెట్లను విసిరివేయడంతో స్టంప్స్ పడ్డాయి.
Fatima sana : అందుకే భారత్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా హాట్ కామెంట్స్..
ఈ సమయంలో టీమ్ఇండియా ప్లేయర్లు మరోసారి అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సాయం కోరారు. సమీక్షలో బంతి వికెట్లను తాకే సమయంలో మునీబా బ్యాట్ గాల్లో ఉండడంతో థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. దీంతో మునీబా నిరాశగా పెవిలియన్‌కు చేరుకుంది. దీంతో ఆరు పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది.
అయితే.. ఈ విషయమై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌండరీ లైన్ ఆవల ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. మునీబా ఎలాంటి పరుగు కోసం ప్రయత్నించలేదని, కాబట్టి అది రనౌట్ కాదని వాదించింది. అయినప్పటికి ఐసీసీ నిబంధనల ప్రకారం అది ఔట్ అని ఫోర్త్ అంపైర్ సైతం విషయాన్ని చాలా క్లియర్‌గా ఆమెకు వివరించారు.
ఐసీసీ నిబంధనలు ఏమీ చెబుతున్నాయి ?
ఎంసీసీ నిబంధనల ప్రకారం.. బంతి వికెట్లను తాకే సమయంలో బ్యాటర్ క్రీజులో లేకపోతే ఔట్ అయినట్లే లెక్క. బ్యాటర్ బ్యాట్ లేదా కాలు లేదా శరీరంలోని ఏ భాగమైనా సరే క్రీజులో ఉండాల్సిందే. క్రీజు లైన్ పైన సగం కంటే బయటకు ఉంటే దాన్ని ఔట్‌గానే పరిగణిస్తారు.
View this post on Instagram
లక్ష్య ఛేదనలో సిద్రా అమిన్ (81; 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించినప్పటికి మునీబా అలీ (2)తో పాటు మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 88 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది.