పాక్ వీసాలెందుకు ఆపారు: భారత్‌ను సస్పెండ్ చేసిన ఒలింపిక్ కమిటీ

పాక్ వీసాలెందుకు ఆపారు: భారత్‌ను సస్పెండ్ చేసిన ఒలింపిక్ కమిటీ

Updated On : February 22, 2019 / 1:23 PM IST

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) భారత్‌కు షాక్ ఇచ్చింది. ఉగ్రదాడికి నిరసనగా అన్ని విధాలా పాక్‌తో సంబంధాలు తెంచుకోవాలనుకున్న భారత్.. నీటి ఒప్పందంతో పాటు, ఎగుమతులు, క్రికెట్ మ్యాచ్‌లు, క్రీడలు అన్నింటిలోనూ సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే భారత్‌లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతోన్న షూటింగ్ కాంపిటీషన్‌కు రావాల్సిన పాక్ క్రీడాకారులను భారత్ అడ్డుకుంది.

ఫిబ్రవరి 20న ఆడేందుకు క్రీడాకారులు వీసా దరఖాస్తు చేసుకున్నారు. హైకమాండ్ ఆమోదిస్తే అనుమతిస్తామని చెప్పిన మేనేజ్‌మెంట్ కొన్ని గంటల వ్యవధిలోనే పుల్వామా దాడిని ప్రస్తావిస్తూ.. వీసాలను ఆపేసింది. ఈ వ్యవహారంతో ఇకపై అంతర్జాతీయ క్రీడాపోటీలకు భారత్ వేదికగా ఉండబోదంటూ ఐఓసీ నిర్ణయించింది. దీంతో పాటు ఢిల్లీలో జరగనున్న ప్రపంచకప్‌ పోటీల నుంచి ఒలింపిక్‌ అర్హత హోదాను కూడా రద్దు చేసింది. 

అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులను, ప్రతినిధులను సమానంగా చూడాల్సిందేనని పేర్కొంది. అలా కాకుండా వివక్షకు పాల్పడితే చర్యలు తప్పవని తెలిపింది. రాజకీయ జోక్యంతో ఎలాంటి ఆటంకాలు కలిగించిన ఐఓసీ తీసుకునే చర్యలకు బాధ్యులు కావల్సిందేనని తెలిపింది. దీంతో భారత్‌ ఇకపై ఐఓసీ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తిస్తామని హామీ ఇస్తేనే ఒలింపిక్‌ సంబంధింత పోటీలు నిర్వహించేందుకు ఆ దేశానికి అనుమతి ఇస్తామని ఒలింపిక్‌ కమిటీ తెలియజేసింది.