ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ను అందుకే తీసుకోలేదు.. ద్రవిడ్ క్లారిటీ

అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ను అందుకే తీసుకోలేదు.. ద్రవిడ్ క్లారిటీ

No disciplinary issues with Ishan Kishan and Shreyas Iyer says Rahul Dravid

Updated On : January 10, 2024 / 6:58 PM IST

Rahul Dravid on Ishan Kishan and Shreyas Iyer: అఫ్గానిస్థాన్‌తో T20 సిరీస్‌కు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై పట్ల పలు ఊహాగానాలు వచ్చాయి. క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వీరిద్దరినీ ఎంపిక చేయలేదన్న వార్తలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ వార్తలను భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ తోసిపుచ్చాడు. ఇందులో వాస్తవం లేదని తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో మానసిక అలసట కారణంగా ఇషాన్ కిషన్ విరామం కోరాడని, దానికి జట్టు మేనేజ్‌మెంట్ అంగీకరించిందని వెల్లడించాడు. సెలక్షన్ కి ఇంకా అతడు అందుబాటులోకి రాలేదని, అతడు సిద్ధంగా ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వస్తాడని మీడియాకు వివరించాడు.

క్రమశిక్షణ చర్యల కారణంగా శ్రేయస్ అయ్యర్‌ జట్టుకు దూరం కాలేదని, అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ద్రవిడ్ తెలిపాడు. జట్టులో ఉన్న పోటీ కారణంగానే అతడిని ఎంపిక చేయలేకపోయామన్నాడు. పరిమిత స్థానాల కోసం చాలా మంది బ్యాటర్లు పోటీ పడుతుండడంతో అతడిని పక్కనపెట్టాల్సి వచ్చిందని వివరించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్‌లోనూ అయ్యర్ కు చోటు దక్కలేదు. క్రమశిక్షణ ఉల్లంఘించినందునే అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే ఏ ఆటగాళ్లకు సంబంధించిన క్రమశిక్షణా సమస్యల గురించి కూడా సెలెక్టర్లతో ఎలాంటి చర్చలు జరగలేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు.

Also Read: టీమిండియాతో T20 సిరీస్.. అఫ్గానిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ

ఫస్ట్ T20కి కోహ్లి దూరం
మొహాలి వేదికగా అఫ్గానిస్థాన్‌తో గురువారం (జనవరి 11) జరగనున్న ఫస్ట్ T20కి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కానున్నాడు. వ్యక్తిగత పనుల కారణంగా కోహ్లి తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదని ద్రవిడ్ తెలిపాడు. రెండు, మూడు మ్యాచ్ లు ఆడతాడని వెల్లడించాడు.

Also Read: టీ20ల్లో ప‌లు రికార్డుల‌పై రోహిత్ శ‌ర్మ క‌న్ను.. మూడు మ్యాచుల్లో సాధిస్తాడా..?