Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఇక రిటైర్ అవుతాడా?

బౌలింగ్‌లో జడేజా విఫలమైన నేపథ్యంలో అతడి మాజీ అండర్ 19 టీమ్‌మెట్‌ శ్రీవత్స గోస్వామి ఆదివారం సాయంత్రం ఎక్స్‌లో ఒక ట్వీట్ చేసి, ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఇక రిటైర్ అవుతాడా?

Ravindra Jadeja (Image Credit To Original Source)

Updated On : January 18, 2026 / 9:17 PM IST
  • శ్రీవత్స గోస్వామి ట్వీట్‌
  • భారత్‌లో అతడికి చివరి వన్డే ఇదే కావచ్చు
  • అతడి సేవలకు సన్మానించాలి

Ravindra Jadeja: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ తరఫున రవీంద్ర జడేజా అన్ని మ్యాచులు ఆడాడు. అయితే, ఈ ఆల్‌రౌండర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఆదివారం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ జడేజా 6 ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ వికెట్‌ కూడా పడగొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌లలో అతడు వరుసగా 9 ఓవర్లు, 8 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

భారత్ తరఫున ఆడిన గత 6 వన్డేల్లో జడేజా కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అతడి ఫామ్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తుది జట్టులో అతడి స్థానం ఎందుకు ఇస్తున్నారంటూ కొందరు అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు.

Also Read: ఇరాన్‌ ఆందోళనల్లో 5,000 మంది మృతి.. 24,000 మందికి పైగా అరెస్టు.. ఇంకా ఏం జరగనుంది?

బౌలింగ్‌లో జడేజా విఫలమైన నేపథ్యంలో అతడి మాజీ అండర్ 19 టీమ్‌మెట్‌ శ్రీవత్స గోస్వామి ఆదివారం సాయంత్రం ఎక్స్‌లో ఒక ట్వీట్ చేసి, ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో జడేజా భవిష్యత్తుపై అతడు సందేహాలు వ్యక్తం చేశాడు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3వ వన్డేనే భారత్ తరఫున జడేజా ఆడే చివరి వన్డే మ్యాచ్ అయ్యే అవకాశం ఉందనే భావన తనలో ఉందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

“రవీంద్ర జడేజా ఎన్నో ఏళ్లుగా భారత్‌కు వెన్నెముకగా నిలిచాడు, మ్యాచ్ విన్నర్‌ కూడా. కానీ, భారత్‌లో అతడి చివరి వన్డే ఇదే కావచ్చనే భావన కలుగుతోంది. అతడు నిశ్శబ్దంగా నిష్క్రమించే ముందు మనం అతడు అందించిన సేవలకుగానూ సన్మానించాలి.

భారత్ తదుపరి వన్డే జూన్‌లో ఇంగ్లాండ్‌తో ఆతిథ్య దేశంలో ఆడుతుంది” అని గోస్వామి ట్వీట్ చేశాడు. కాగా, 2008 అండర్ 19 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచిన జట్టులో జడేజాతో గోస్వామి ఆడాడు. ఇటీవలి మ్యాచ్‌లలో రవీంద్ర జడేజా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణించలేకపోయాడు.