Shane Bond : టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కు కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ హెచ్చరిక..
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Shane Bond warns Jasprit Bumrah against rushing from injury ahead of IPL 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. అయితే.. ఈ టోర్నీలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడలేదు. గాయం కారణంగా ఈ మెగాటోర్నీకి బుమ్రా దూరంగా ఉన్నాడు. మరో 10 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ టోర్నీలోనూ మొదటి రెండు వారాలు బుమ్రా పాల్గొనే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్‌లోనే అతడు ముంబై ఇండియన్స్ జట్టులో చేరతాడని అంటున్నారు.
ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే చోట మరోసారి వెన్ను గాయమైతే.. బుమ్రా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌ను బాండ్ హెచ్చరించాడు. ఒకచోట రెండు సర్జరీలు చేయించుకుంటే.. కోలుకోవడం కష్టం అని తెలిపాడు. కాబట్టి బుమ్రాను టీమ్‌మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నాడు.
వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల కంటే అతడిని ఎక్కువగా ఆడించకూడదన్నాడు. ‘రానున్న ప్రపంచ కప్‌లను దృష్టిలో పెట్టుకుంటే బుమ్రా ఎంతో కీలకమైన ఆటగాడు. ఈ క్రమంలో అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే అతడిని ఆడించాలి. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే టెస్ట్ ఫార్మాట్‌లో ఆడడం కూడా అంత సులభం కాదు.’ అని బాండ్ అన్నాడు.
బుమ్రా విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ వర్క్‌లోడ్ అంశాన్ని ఎలా నిర్వహిస్తుందనేది కీలకం అని బాండ్ చెప్పాడు.
2023లో బుమ్రా వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో కొద్ది కాలం ఆటకు దూరం అయ్యాడు. కోలుకుని వచ్చిన తరువాత బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో మరోసారి వెన్నునొప్పితో అతడు ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ప్రస్తుం అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు.