Shashi Tharoor: సంజు శాంసన్‌ను కాదని సూర్యకుమార్‌ను ఎందుకు ఎంపిక చేశారు?

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తప్పుబట్టారు.

Shashi Tharoor: సంజు శాంసన్‌ను కాదని సూర్యకుమార్‌ను ఎందుకు ఎంపిక చేశారు?

Shashi Tharoor Fumes At Sanju Samson Yuzvendra Chahal Absence From T20I Squad

Updated On : November 23, 2023 / 5:29 PM IST

Shashi Tharoor – Sanju Samson: ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడాన్ని పలువురు సీనియర్లు ఆటగాళ్లు ఆక్షేపించారు. తాజాగా రాజకీయ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. సంజు శాంసన్‌ను కాదని సూర్యకుమార్‌కు కెప్టెన్సీ కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ విమర్శించారు. సూర్యకుమార్‌తో పోలిస్తే సంజు సమర్థవంతుడని, అతడికి టీ20 టీమ్ పగ్గాలు అప్పగిస్తే బావుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సెలెక్టర్లు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని కూడా ఆయన ప్రశ్నించారు.

వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా టీ20 టీమ్‌ను ఎంపిక చేశారు. రింకు సింగ్, జితేష్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి యువ ఆటగాళ్లను జట్టులో చోటు కల్పించారు. అయితే సంజు శాంసన్‌, చహల్‌ను ఎంపిక చేయకపోవడంపై చాలా మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలక్టర్లను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ కూడా స్పందించారు.

రంజీట్రోఫీ, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సంజు శాంసన్‌కు అనుభవం ఉందని, సీనియర్లు అందుబాటులో లేనప్పుడు అతడికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని శశి థరూర్ ప్రశ్నించారు. కెప్టెన్‌గా సూర్యకుమార్ కంటే సంజుకే ఎక్కువ అనుభవం ఉందన్నారు. క్రికెట్ అభిమానులకు దీనిపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ సెలక్టర్లను డిమాండ్ చేశారు. చహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. కాగా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి మ్యాచ్ వైజాగ్‌లో జరుగుతుంది.

Also Read: నువ్వు టీమ్ఇండియా కోచ్‌గా రా బాసూ..! నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న ఫ్యాన్‌.. వీడియో