GT vs PBKS : సెంచరీని త్యాగం చేసిన శ్రేయస్ అయ్యర్.. నిజంగా నువ్వు గ్రేట్ సామీ..
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ తన సెంచరీని త్యాగం చేశాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే.. అతడు సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికి కూడా జట్టు కోసం తన సెంచరీని త్యాగం చేశాడు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 220 పరుగులుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ (97), శశాంక్ సింగ్ (22) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరి ఓవర్‌ను సిరాజ్ వేయగా శశాంక్ సింగ్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. అయితే.. అతడు సింగిల్ తీసి ఇస్తే శ్రేయస్ ఈజీగా సెంచరీ చేసుకునే వాడు. కానీ.. అతడు తన వ్యక్తిగత మైలురాయి కోసం కాకుండా జట్టు కోసం ఆడాలని శశాంక్‌కు చెప్పాడు.
GT vs PBKS : గుజరాత్ టైటాన్స్ పై విజయం తరువాత.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
దీంతో శశాంక్ తొలి బంతిని బౌండరీగా మలిచాడు. రెండో బంతికి రెండు పరుగులు, ఆ తరువాత వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఓ వైడ్ పడగా.. మొత్తంగా ఆఖరి ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్‌తో పాటు శశాంక్ సింగ్ (44 నాటౌట్; 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రియాన్ష్ ఆర్యా (47; 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
అనంతరం సాయి సుదర్శన్ (74; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), జోస్ బట్లర్ (54; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫానీ రూథర్‌ఫర్డ్ (46; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సర్లు) దంచికొట్టినప్పటికి లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులకే పరిమితం అయింది. దీంతో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
కాగా.. పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ ఆఖరి ఓవర్‌లో చేసిన పరుగులే మ్యాచ్ చివర్లో కీలకంగా మారాయి. దీంతో శ్రేయస్ తన సెంచరీని త్యాగం చేయడంతోనే మ్యాచ్ గెలిచిందని నెటిజన్లు.. శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దీనిపై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. నిజమైన నాయకత్వం అంటే శ్రేయస్ అయ్యర్ దే అని చెప్పాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యం ఆ తరువాతే వ్యక్తిగత ప్రయోజనాలు అంటూ శ్రేయస్ అయ్యర్ నిరూపించాడన్నారు.