Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం.. కొన్నాళ్లు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరం..
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కొంతకాలం పాటు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు.

Shreyas Iyer will be taking a break from red ball cricket
Shreyas Iyer : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్ల పాటు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలియజేశాడు. తనను వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పరిగణలోకి తీసుకోవద్దని కోరాడు.
శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer ) వెన్ను నొప్పి బాధిస్తుందట. ఈ క్రమంలోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా.. అయ్యర్ లక్నో వేదికగా మంగళవారం నుంచి ఆస్ట్రేలియా-ఏతో ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ భారత్-ఏ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో అయ్యర్ విఫలం అయ్యాడు. కేవలం 13 బంతులు ఎదుర్కొని 8 పరుగులే చేశాడు.
గతంలో కూడా శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. టీమ్ఇండియాకు దూరం అయ్యాడు. రీఎంట్రీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్ తరుపున పరుగుల వరద పారించాడు.
అయినప్పటికి అతడికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కలేదు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు చోటు ఖాయం అనుకుంటున్న సమయంలో అయ్యర్ వెన్నునొప్పి తిరగబెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు కోలుకునేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లాడు.