IND-w VS IRE-w : సెంచరీల మోత.. భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు..
భారత వన్డే క్రికెట్ చరిత్రలో (మహిళల, పురుష) ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

Smriti Mandhana and Pratika Rawal centuries help Indian team register their highest ever score in ODIs
రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్ మహిళలతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచులో టీమ్ఇండియా బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (154: 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్), స్మృతి మంధాన (135: 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ శతకాలతో చెలరేగగా, వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్ (59: 42 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత వన్డే క్రికెట్ చరిత్రలో (మహిళల, పురుష) ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇంతకముందు భారత పురుషుల జట్టు 2011లో వెస్టిండీస్ పై 5 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. కాగా.. భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు (370/5. ) ఐర్లాండ్ పైనే కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే భారత ఓపెనర్లు ఐర్లాండ్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. అయితే.. స్మృతి మంధాన 12 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను ఐర్లాండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మంధాన.. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడింది. భారత్ తరుపున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసింది. కేవలం 70 బంతుల్లో మంధాన ఈ మార్క్‌ను అందుకుంది.
మరోవైపు ప్రతీకా రావల్ సైతం వేగంగా ఆడింది. 100 బంతుల్లో సెంచరీని అందుకుంది. తొలి వికెట్‌కు ప్రతీకా-మంధాన జోడీ 233 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధాన ఔట్ కావడంతో ఐర్లాండ్‌కు సంతోషించడానికి ఏమీ లేకుండా పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్ దంచికొట్టింది. అటు సెంచరీ తరువాత ప్రతీకా టాప్ గేర్‌లోకి వెళ్లిపోయింది. మరో 27 బంతుల్లోన్లే ఆమె 150 మార్క్‌ను దాటేసింది.
ప్రతీకా-రిచా జోడీ రెండో వికెట్‌కు కేవలం 12 ఓవర్లలో 104 పరుగులు జోడించింది. ఆఖరి పది ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లు కాస్త పుంజుకోవడంతో భారత్ 450 పరుగులకు కాస్త దూరంలో ఆగిపోయింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా రెండు వికెట్లు తీసింది. కెల్లీ, ఫ్రేయా, డెంప్సీలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
🚨 HISTORY IN RAJKOT. 🚨
– India post their highest ever total in ODI history – both including men and women. 🤯🇮🇳 pic.twitter.com/Qxg50OERBm
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2025