Bengaluru stampede : బెంగళూరు తొక్కిసలాట ఘటన : ‘నా కొడుకు శరీరాన్ని ముక్కలు చేయకండయ్యా..’ ఓ మృతుడి తండ్రి ఆవేదన..
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు.

Son Dead In Bengaluru Stampede, Inconsolable Father Makes A Request
చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో ఆర్‌సీబీ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రోఫీతో ఆర్‌సీబీ జట్టు బుధవారం బెంగళూరుకు చేరుకుంది. ఆర్‌సీబీ విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతి చెందిన తన కొడుకును తలచుకుని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. తన కుమారుడి శరీరాన్ని ముక్కలు చేయొద్దు అని, ఆ తండ్రి వేడుకున్న తీరు అందరిని కలచి వేస్తోంది.
‘నాకు ఒక్కడే కొడుకు. నాకు తెలియకుండానే అతడు ఇక్కడికి వచ్చాడు. తొక్కిసలాటలో అతడు చనిపోయాడు. సీఎం, డిప్యూటీ సీఎం మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శించవచ్చు.. గానీ, నా కొడుకును ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే కనీసం పోస్ట్ మార్టం చేయకుండా నా కొడుకు శరీరాన్ని ఇప్పించండి. నా కొడుకు శరీరాన్ని ముక్కలు చేయవద్దు.’ అని ఓ తండ్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
కాగా.. గురువారం ఉదయానికి మృతదేహాలకు నిబంధనల ప్రకారం పోస్టమార్టం నిర్వహించారు. ఆ తరువాత మృతదేహలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విచారణకు ఆదేశించాం..
తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక అందుతుందని భావిస్తున్నారు. బెంగళూరు దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.