IND vs ENG 4th T20 : మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ విజయం.. సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడో విన్నారా?
పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తరువాత సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Surya kumar Yadav comments after win 4th t20 match against England
టీ20ల్లో టీమ్ఇండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత వరుస సిరీస్ విజయాలతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూసుకుపోతున్నాడు. అతడి సారథ్యంలో భారత జట్టు మరో సిరీస్ విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 15 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత హార్దిక్ పాండ్య (53; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబె (53; 34 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రింకూ సింగ్ (30), అభిషేక్ శర్మ (29)లు రాణించారు. సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0)లు విపలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు తీశాడు. జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (51; 26 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో వికెట్ సాధించారు.
ఎలా ఆడాలో కుర్రాళ్లకు తెలుసు..
మ్యాచ్ గెలిచిన తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జట్టులోని ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన చేశారన్నాడు. మైదానంలోని ప్రేక్షకులు మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి అయ్యే వరకు ఎప్పుడూ తమకు సపోర్టుగానే ఉన్నారన్నాడు. తొలుత 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో మ్యాచ్‌ను చేజార్చుకోవద్దని భావించాము. జట్టుగా తాము ఎలాంటి బ్రాండ్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామో కుర్రాళ్లకు బాగా తెలుసునని చెప్పాడు.
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడ్డాం. అయితే.. ఈ క్లిష్ట సమయంలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె చాలా గొప్పగా ఆడారు. వారిద్దరూ తమ అనుభవాన్ని అంతా చూపించి పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాడు. నెట్స్ ఏం విధంగా అయితే బ్యాటింగ్ చేస్తామో అదే విధంగా మ్యాచ్‌లోనూ అలాగే ఆడాలని అనుకున్నాము. ఈ మ్యాచ్‌లో అయితే.. బ్యాటర్ల నమ్మశక్యంగానీ విధంగా ఆడారు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మేము సరైన దిశలో వెలుతున్నట్లుగా భావిస్తున్నాను అని సూర్య అన్నాడు.
ఇక ఇంగ్లాండ్ పవర్ ప్లే లో ధాటిగా ఆడింది. దీనిపై సూర్య మాట్లాడుతూ.. పవర్ ప్లే తరువాత మ్యాచ్ తమ నియంత్రణలోకి వస్తుందని తెలుసు అని చెప్పాడు. ముఖ్యంగా 7 నుంచి 10 ఓవర్ల మధ్య రెండు మూడు వికెట్లు తీస్తే మ్యాచ్ ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో అలాగే జరిగింది. వికెట్లు పడడంతో మ్యాచ్ మా కంట్రోల్ లోకి వచ్చింది. దురదృష్టవశాత్తు శివమ్ దూబె ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. అతడి స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా మూడో సీమర్‌గా అద్భుతంగా రాణించాడు. అని చెప్పాడు.
ఇక ఈ సిరీస్‌లో నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్ ఆదివారం ముంబై వేదికగా జరగనుంది.