Head coach: టీమిండియా తదుపరి కోచ్ ఎవరు? రేసులో ఎవరెవరున్నారు?

అయినా ఆయన పేరు రేసులో ముందువరుసలో ఉంది. గతంలో టీమిండియా ఓపెనర్‌గా..

Head coach: టీమిండియా తదుపరి కోచ్ ఎవరు? రేసులో ఎవరెవరున్నారు?

ఇండియా క్రికెట్ టీమ్ కోచ్ రేసులో గౌతమ్ గంభీర్ ముందు వరసలో ఉన్నాడు. మెంటార్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించడం గంభీర్‌కు లాభించింది. తీవ్రమైన ఒత్తిడి, అనేక రాజకీయాలు ముడిపడి ఉండే భారత క్రికెట్ కోచ్‌ పదవీ నిర్వహణ అనుకున్నంత తేలిక కాదు. విదేశీకోచ్‌లకు ఉన్నంత ప్రాధాన్యత స్వదేశీ కోచ్‌లకు ఉండదన్న అభిప్రాయం ఇటీవల చెరిగిపోయింది. వరుసగా భారత మాజీ క్రికెటర్లే కోచ్‌లుగా మారుతున్నారు. అదే కోవలో రాహుల్ ద్రావిడ్ వారసత్వం గంభీర్‌కే దక్కుతుందని భావిస్తున్నారు.

భారత క్రికెట్ టీమ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌నే నియమించాలన్న డిమాండ్ పెరిగిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో ఈ డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటిదాకా రేసులో వీవీఎస్ లక్ష్మణ్, ఆశిష్ నెహ్రా, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, కుమార సంగక్కర వంటి పేర్లు రేసులో వినిపించాయి.

బీసీసీఐ ఉద్దేశం?
అయితే…రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని మరో ఇండియన్‌కే అప్పగించాలన్నది బీసీసీఐ ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే గత ఏడాది ఏడోస్థానంలో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఈ సారి ఐపీఎల్ విజేతగా నిలవడం వెనక మెంటార్‌గా గంభీర్ వ్యూహాలు ఫలించడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీసీఐ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

T20 వరల్డ్‌కప్‌తో టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌తోనే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోయినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు రాహుల్ ద్రవిడ్ ఇప్పటిదాకా కొనసాగాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతో మళ్లీ పదవిలో కొనసాగడానికి ద్రవిడ్ సముఖంగా లేడు.

దీంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. రేసులో గంభీర్‌తోపాటు వినిపించిన పేర్లు వీవీఎస్ లక్ష్మణ్, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, కుమార సంగక్కర. అయితే వీవీఎస్ నేషనల్ క్రికెట్ అకాడమీ ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అనంతరం రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోచ్ బాధ్యతలు స్వీకరించడానికి లక్ష్మణ్ నిరాకరించాడు.

దీంతో ఆయన ఇప్పుడు కోచ్ రేసులో లేనట్టే. అలాగే బీసీసీఐ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని, అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సి ఉన్నందున తాను భారత క్రికెట్ కోచ్‌గా ఉండే అవకాశం లేదని రికీ పాంటింగ్ చెప్పాడు. కుమార సంగక్కర కూడా తాను రేసులో లేనని చెప్పాడు. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఆస్ట్రేలియన్లను కోచ్‌ పదవికి సంప్రదించామన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. బీసీసీఐ ఆస్ట్రేలియన్లను సంప్రదించలేదన్నారు. భారత క్రికెట్ వ్యవస్థ గురించి పూర్తిగా తెలిసినవారినే కోచ్‌ పదవికి ఎంపిక చేస్తామని తెలిపారు.

తనను ఎంపిక చేస్తానని హామీ ఇస్తేనే కోచ్ పదవికి అప్లయ్ చేస్తానని గౌతమ్ గంభీర్ అన్నట్టు ప్రచారం జరిగింది. రాహల్ ద్రవిడ్ భారత్ ఏ జట్టుకు కోచ్‌గా పనిచేసి అద్భుత ఫలితాలు రాబట్టడంతో టీమిండియా కోచ్ పదవి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. కానీ గంభీర్ అలా కాదు. ఏ జూనియర్ జట్టుకు గంభీర్ కోచింగ్ ఇవ్వలేదు.

అయినా ఆయన పేరు రేసులో ముందువరుసలో ఉంది. గతంలో టీమిండియా ఓపెనర్‌గా ఉన్న రికార్డులు, ఐపీఎల్ రికార్డులు, కోల్‌కతా నైట్ రైడర్స్ మునిగిపోతున్న నౌకలా ఉన్న సమయంలో…ఆ జట్టు పగ్గాలు చేపట్టి రెండు సార్లు ఛాంపియన్‌గా నిలపడం, ఇప్పుడు మెంటార్‌గానూ అద్భుతాలు సృష్టించడం వంటివి గంభీర్ పేరు ప్రముఖంగా వినిపించేలా చేస్తున్నాయి.

వివాదాస్పద వ్యక్తిగా..
మైదానంలో గౌతమ్‌ గంభీర్ ఆటతీరు గురించి పక్కనపెడితే…వ్యక్తిత్వం పరంగా గమనిస్తే సౌమ్యంగా కనిపించే వివాదాస్పద వ్యక్తిగా గంభీర్‌ను భావించాలి. దీనికి కారణం అతని ముక్కుసూటి వైఖరి. ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా మాట్లాడతాడు. ఎవ్వరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. అలాగే క్రికెట్ అనేది సమష్టిగా ఆడే ఆట అని, ఏ ఒక్కరికో విజయం క్రెడిట్ ఇవ్వడం తగదన్నది గంభీర్ అభిప్రాయం. 2011 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడు.

అయితే ఆ ఘన విజయం క్రెడిట్ మొత్తం ధోనీ, కోహ్లీ ఖాతాలోకి చేరిందన్నది అంగీకరించితీరాల్సిన నిజం. గంభీర్ పలుమార్లు ఈ విషయాన్ని తప్పుపట్టాడు. ఫైనల్‌లో శ్రీలంకపై గంభీర్ 97 పరుగులు చేశాడు. కానీ ఆ పరుగులు గురించి ఎవరూ మాట్లాడలేదు. ఐదు ఓవర్లలో ఆరు పరుగులు ఇచ్చిన జహీర్‌ ఖాన్‌ గొప్పతనాన్ని గుర్తించకపోవడం కూడా గంభీర్‌కు ఆగ్రహం తెప్పించిందని రవిచంద్రన్ అశ్విన్ ఓ సందర్భంలో చెప్పాడు. జట్టు అంతటినీ గుర్తించాలని, విజయంలో అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని గౌతమ్ గంభీర్ చేసే వాదనను సమర్థించేవారు దేశమంతా ఉన్నారు.

Also Read: మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోల్‌క‌తా ఆట‌గాళ్ల సెల‌బ్రెష‌న్స్ చూశారా..?