AUS vs IND : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పెర్త్‌లో భారత రికార్డు ఇదే..
క్రికెట్ అభిమానులు అంతా బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Team India record in Perth ahead of Border Gavaskar Trophy 1st Test match
క్రికెట్ అభిమానులు అంతా బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో కివీస్ చేతిలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది భారత్. ఆ పరాభవాన్ని మరిచిపోయి వరుసగా మూడోసారి ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలని ఆరాటపడుతోంది. అయితే.. అటు ఆసీస్ సైతం ఈ సారి భారత్ పై విజయం సాధించి ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలగా ఉంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరుకోవాలంటే భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
AUS vs IND : భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
కాగా.. పెర్త్ స్టేడియంలో భారత రికార్డు ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
ఈ స్టేడియంలో భారత్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. పెర్త్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ రెండు మ్యాచులు ఆడి 259 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఈ స్టేడియంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా 140 పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్ ఆడిన అజింక్యా రహానే, రిషబ్ పంత్‌లు వరుసగా 81, 66 పరుగులు చేశారు.
ఈ ముగ్గురిలో రహానే మినహా మిగిలిన ఇద్దరు తొలి టెస్టు ఆడనున్నారు. తమకు అచ్చొచ్చిన స్టేడియంలో కోహ్లీ, రిషబ్‌పంత్‌లు భారీ స్కోర్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరితో పాటు మిగిలిన వారు రాణిస్తే టీమ్ఇండియా భారీ స్కోర్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే.. బిషన్ సింగ్ బేడీ ఒక్క మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, హార్ధిక్ పాండ్యాలు ఒక్కొ మ్యాచ్ ఆడారు. అర్ష్‌దీప్ రెండు వికెట్లు తీయగా.. పాండ్య, అశ్విన్‌లు ఒక్క వికెట్ మాత్రమే సాధించారు. వీరిలో అశ్విన్ ఒక్కడే ప్రస్తుత జట్టులో ఉన్నాడు.