IND vs NZ : రాణించిన డారిల్ మిచెల్, బ్రేస్‌వెల్.. భారత లక్ష్యం ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఉంచింది.

దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ (63; 101 బంతుల్లో 3 ఫోర్లు), బ్రాస్‌వెల్ (53 నాటౌట్; 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
రచిన్ రవీంద్ర (37; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గ్లెన్ ఫిలిప్స్ (34; 52 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, షమీలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
IND vs NZ : నేను అక్కడ ఉంటే ఇలా మిస్ చేసే వాడిని కాదు.. రిషబ్ పంత్ రియాక్షన్ వైరల్..
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రచిన్ రవీంద్ర భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. యడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో చూస్తుండగానే కివీస్ స్కోరు 7 ఓవర్లలోనే 50 పరుగులు దాటిపోయింది. మరో ఓపెనర్ విల్ యంగ్ (15) ఆరంభం నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఎల్బీగా విల్‌యంగ్ ఔట్ చేయడం ద్వారా వరుణ్ చక్రవర్తి 57 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.
ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రచిన్, కేన్ విలియమ్స్ సన్ (11), టామ్ లాథమ్ (14) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి ఆదుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన తరువాత ఫిలిప్స్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
మరోవైపు డారిల్ మిచెల్ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించాడు. చెత్త బంతును బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరిలో వేగంగా ఆడే క్రమంలో షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. చివరల్లో బ్రాస్‌వెల్ మెరుపులు మెరిపించడంతో కివీస్ స్కోరు 250 దాటింది.