టీ20 : బంగ్లాపై ఘన విజయం.. సిరీస్ భారత్ కైవసం
కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్ విజయం

కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్ విజయం
కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాట్‌తో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మెరవగా.. తర్వాత బంతితో దీపక్ చాహర్ హ్యాట్రిక్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫలితంగా మూడో టీ20లో టీమ్‌ఇండియా 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో రోహిత్‌సేన కైవసం చేసుకుంది.
నాగ్ పూర్ విదర్భ స్టేడియంలో ఆఖరి టీ 20 జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. దూకుడుగా ఆడే యత్నంలో ధావన్ కూడా ఔటయ్యాడు. దీంతో 35 పరగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బంగ్లా బౌలర్లపై చెలరేగింది. రాహుల్ స్ట్రోక్‌ప్లేతో అదరగొట్టగా.. శ్రేయస్ సిక్సర్లతో చెలరేగాడు. పంత్ మరోసారి నిరాశపరిచాడు. ఆఖర్లో మనీశ్ పాండే బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 174 పరుగులు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో ఫఫియుల్, సౌమ్య సర్కార్ చెరో రెండు, అల్‌అమిన్ ఓ వికెట్ తీశాడు.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను దీపక్ చాహర్ ఆదిలోనే దెబ్బతీశాడు. మూడో ఓవర్‌లో లిటన్ దాస్, సౌమ్య సర్కార్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిథున్‌తో జత కలిసిన మహ్మద్ నయీమ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చక్కని షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వారి జోరు చూస్తే బంగ్లా విజయం ఖాయమన్నట్లే కనిపించింది.
కానీ 13వ ఓవర్లో మిథున్‌ను దీపక్ ఔట్ చేయడంతో 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారత్‌దే పైచేయి. శివమ్ దూబే 3 కీలక వికెట్ల పడగొట్టి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చివర్లో షఫియుల్, ముస్తాఫిజుర్, అమినుల్ ఇస్లామ్‌ను వరుస బంతుల్లో ఔట్ చేసి దీపక్ చాహర్ హ్యాట్రిక్‌తో పాటు 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బంగ్లా పోరాటం 19.2 ఓవర్లలోనే 144 పరుగుల వద్దే ముగిసింది.
ఇక భారత్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు చాహర్. అంతేకాదు టీ20లో అజంతా మెండిస్ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేశాడు చాహర్. మొత్తం మీద 7 పరుగులే ఇచ్చిన చాహర్ 6 వికెట్లు పడగొట్టి టీ20ల్లో కొత్త రికార్డ్ సృష్టించాడు. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన దీపక్ చాహర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.