2024 Roundup : ఈ ఏడాది రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా ఆటగాళ్లు వీరే..
పొట్టి ఫార్మాట్‌కు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు రిటైర్‌మెంట్ ప్రకటించగా మరికొందరు ఆటగాళ్లు మాత్రం మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.

Players Who Retires In 2024: మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఇక 2024 ఏడాదిలో భారత క్రికెట్‌లో కొన్ని మధుర స్మృతులు ఉండగా మరికొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాదిని క్రికెట్ ప్రేమికులు ఎవ్వరూ అంత త్వరగా మరచిపోలేరు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను సాధించడం ఓ కారణం కాగా.. పొట్టి ఫార్మాట్‌కు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు రిటైర్‌మెంట్ ప్రకటించగా మరికొందరు ఆటగాళ్లు మాత్రం మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికడం మరో కారణం.
ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 10 మంది ఆటగాళ్లు రిటైర్‌మెంట్ ప్రకటించారు.
రోహిత్ శర్మ..
17 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా 2024 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. యావత్ భారత దేశం సంతోషంలో ఉండగా.. పొట్టి ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీమ్ఇండియా తరుపున 159 టీ20 మ్యాచులు ఆడిన హిట్‌మ్యాన్ 32 సగటుతో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 32 అర్థశతకాలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ..
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 76 పరుగులు సాధించాడు. లీగ్ దశలో విఫలమైన కీలకమైన ఫైనల్ మ్యాచులో చెలరేగి ఆడాడు కోహ్లీ. ప్రపంచకప్ విజయం సాధించగానే టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. భారత్ తరుపున కోహ్లీ 125 టీ20లు ఆడాడు. 48.7 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 38 అర్థశతకాలు ఉన్నాయి.
రవీంద్ర జడేజా..
రోహిత్ శర్, విరాట్ కోహ్లీ రూట్‌లోనే రవీంద్ర జడేజా సైతం పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవగానే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. భారత్ తరుపున జడేజా 74 టీ20 మ్యాచులు ఆడగా.. 21.4 సగటుతో 405 పరుగులు చేశాడు.
పై ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు మాత్రమే రిటైర్‌మెంట్ ప్రకటించారు. టెస్టులు, వన్డేలతో పాటు ఐపీఎల్ ఆడుతున్నారు.
Senior Womens Trophy 2024 : చరిత్ర సృష్టించిన బెంగాల్ జట్టు..
శిఖర్ ధావన్..
ఈ ఏడాది ఆగస్టులో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ధావన్ భారత్ తరుపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 40.6 సగటుతో 2315 పరుగులు, వన్డేల్లో 44.1 సగటుతో 6793 పరుగులు, టీ20ల్లో 27.9 సగటుతో 1759 పరుగులు సాధించారు.
దినేశ్ కార్తీక్..
తన పుట్టిన రోజున దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. భారత్ తరుపున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 1025 పరుగులు, వన్డేల్లో 1752 పరుగులు, టీ20ల్లో 686 పరుగులు చేశాడు. అంతేకాదండోయ్ ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పాడు. 257 ఐపీఎల్ మ్యాచుల్లో 4842 పరుగులు సాధించాడు.
కేదార్ జాదవ్..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కేదార్ జాదవ్ భారత్ తరుపున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. వన్డేల్లో 42.1 సగటుతో 1389 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థశతకాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 20.3 సగటుతో 122 పరుగులు సాధించాడు. వన్డేల్లో 27 వికెట్లు పడగొట్టాడు.
Manu Bhaker father : మను భాకర్ తండ్రి ఆవేదన.. తప్పు చేశాను.. షూటర్‌ను కాకుండా..
సిద్ధార్థ్ కౌల్..
టీమ్ఇండియా బౌలర్ సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. భారత్ తరుపున అతడు మూడు వన్డేలు, మూడు టీ20లు మాత్రమే ఆడాడు. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. టీ20ల్లో మాత్రం నాలుగు వికెట్లు పడగొట్టాడు.
వరుణ్ ఆరోన్..
2011లో టీమ్ఇండియా తరుపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు వరుణ్ ఆరోన్. మొత్తంగా భారత జట్టు తరుపున 9 వన్డేలు, 9 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 11 వికెట్లు, టెస్టుల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్టులకు వీడ్కోలు పలికాడు.
వృద్ధిమాన్ సాహా..
నవంబర్‌లో వృద్ధిమాన్ సాహా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీమ్ఇండియా తరుపున 40 టెస్టుల్లో 29.4 సగటుతో 1353 పరుగులు, 9 వన్డేల్లో 41 పరుగులు ఐపీఎల్‌లో 170 మ్యాచుల్లో 24.2 సగటుతో 2934 పరుగులు సాధించాడు.
సౌరభ్ తివారీ..
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు సౌరభ్ తివారీ వీడ్కోలు పలికాడు. భారత్ తరుపున కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. 49 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో 93 మ్యాచులు ఆడి 28.7 సగటుతో 1494 పరుగులు సాధించాడు.