Tokyo Paralympics : ప్రమోద్ భగత్ సంచలనం.. భారత్‌కు 4వ గోల్డ్ మెడల్
టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.

Tokyo Paralympics
Tokyo Paralympics : టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా మరొకరిని స్వర్ణం వరించింది.
బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో షట్లర్ ప్రమోద్ భగత్ ఘన విజయం సాధించాడు. బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుసగా రెండు సెట్లల్లో 45 నిమిషాల్లో ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో వరల్డ్ నెం.1 పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్ చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ గా అరుదైన ఘనత సాధించాడు ప్రమోద్. ఇక, ఈ గేమ్స్ లో భారత్ కు ఇది ఓవరాల్ గా నాలుగో స్వర్ణ పతకం.
పారాలిపిక్స్‌లో ఇదే విభాగంలో మనోజ్ సర్కార్ సైతం కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మనోజ్ సర్కార్ జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను 22-20 21-13 తేడాతో ఓడించాడు. పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరగా, మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల జాబితాలో భారత్ 25 వ స్థానానికి ఎగబాకింది.
పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ అద్భుతమైన ఆటతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ కొనియాడారు.