IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో మొద‌టి టెస్టుకు ముందు.. భార‌త్‌ను ఇబ్బంది పెడుతున్న రెండు అంశాలు ఇవే..?

మ‌రో రెండు రోజుల్లో ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో మొద‌టి టెస్టుకు ముందు.. భార‌త్‌ను ఇబ్బంది పెడుతున్న రెండు అంశాలు ఇవే..?

Two Big Questions Troubling Team India Ahead Of South Africa Tests

India vs South Africa : మ‌రో రెండు రోజుల్లో ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 సైకిల్‌లో టీమ్ఇండియా ఫైన‌ల్ చేరుకోవాలంటే ద‌క్షిణాఫ్రికాతో ఆడ‌నున్న రెండు టెస్టు మ్యాచుల‌ సిరీస్‌లో విజ‌యం సాధించ‌డం ఎంతో ముఖ్యం. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా త‌న అత్యుత్త‌మ జ‌ట్టుతో స‌ఫారీల‌తో త‌ల‌ప‌డాల‌ని భావిస్తోంది. అయితే.. గాయం కార‌ణంగా మ‌హ్మ‌ద్ ష‌మీ, హ‌ర్దిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్‌ వంటి ఆట‌గాళ్లు దూరం కావ‌డంతో ఎలాంటి కాంబినేష‌న్‌తో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగుతుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

డిసెంబ‌ర్ 26న సెంచూరియన్ పార్క్ వేదిక‌గా మొద‌టి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జ‌ట్టులో మిగిలిన స్థానాల విష‌యంలో ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఓ రెండు స్థానాల విష‌యంలో మాత్రం మేనేజ్‌మెంట్‌కు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. కేఎల్ రాహుల్‌ను బ్యాట‌ర్‌గా తీసుకోవాలా..? లేదంటే వికెట్ కీప‌ర్ గా తీసుకోవాలా..? అన్న అంశం ఒక‌టి కాగా.. మూడో పేస‌ర్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌నేది రెండోది.

సెంచూరియ‌న్ పార్క్ పేస‌ర్లు స్వ‌ర్గ‌ధామం కావ‌డంతో భార‌త్ ముగ్గురు పేస‌ర్ల‌తో బ‌రిలోకి దిగే అవకాశం ఉంది. జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు ఇద్ద‌రు ఖ‌చ్చితంగా తుది జ‌ట్టులో ఉంటారు. వీరితో పాటు మూడో పేస‌ర్‌గా ముకేశ్ కుమార్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌లో ఎవ‌రిని ఎంచుకుంటారో అన్న అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇద్ద‌రిలో ఎవ‌రు..?

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో టెస్టుల్లో ముకేశ్ కుమార్ అరంగ్రేటం చేశాడు. వాస్త‌వానికి అయితే అత‌డు నేరుగా తుది జ‌ట్టులో ఆడొచ్చు. కానీ ఈ పేస‌ర్ గ‌త కొంత‌కాలంగా అత్యుత్త‌మ ఫామ్‌లో క‌నిపించ‌డం లేదు. 40 ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడిన ముకేశ్ 151 వికెట్లు ప‌డ‌గొట్టాడు. లాంగ్ స్పెల్స్ వేయ‌డంతో పాటు రివ‌ర్స్ స్వింగ్ కూడా రాబ‌ట్ట‌గ‌ల‌గ‌డం అత‌డి ప్ర‌ధాన బ‌లం.

Mukesh kumar- Prasidh Krishna

Mukesh kumar- Prasidh Krishna

అయితే.. బెంగ‌ళూరు చెందిన ప్ర‌సిద్ధ్ కృష్ణ హిట్-ది-డెక్ అంశాలు సూపర్‌స్పోర్ట్ పార్క్‌కు అనువైన‌వి కావ‌డం ఇక్క‌డ అత‌డికి క‌లిసి వ‌చ్చే అంశం. ముకేశ్‌తో పోలిస్తే ప్రసిద్ధ్ కొంచెం ఎక్కువ వేగంగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. అత‌డి పొడ‌వు కార‌ణంగా బౌన్స్ ఎక్కువ‌గా రాబ‌ట్టవచ్చు. అయితే.. అధికంగా ప‌రుగులు ఇవ్వ‌డం, 2015లో రంజీ ట్రోఫీ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అత‌డు 15 ఫస్ట్‌క్లాస్ గేమ్‌లు కూడా ఆడ‌క‌పోవ‌డం అనేది ఇక్క‌డ అత‌డికి ప్ర‌తికూలంశంగా మారుతుంది.

ప్ర‌స్తుత ఫామ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ప్ర‌సిద్ధ్‌కు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే.. రెడ్ బాల్ క్రికెట్‌లో అనుభ‌వాన్ని తీసుకుంటే ముకేశ్ అవ‌కాశాలు మెండుగా ఉంటాయి. చూడాలి మ‌రీ వీరిద్ద‌రిలో తుది జ‌ట్టులో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంది అనేది.

కేఎల్ ‘ది బ్యాటర్’ లేదా కేఎల్ ‘ది కీపర్’..

2021లో మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ఆడేందుకు వ‌చ్చిన భార‌త జ‌ట్టు గెలిచిన ఏకైక టెస్టు మ్యాచ్ సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా జరిగింది. ఆ మ్యాచులో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రాహుల్ శ‌త‌కంతో మెరిశాడు. కానీ గత రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. రాహుల్ తన ఫామ్‌ను కోల్పోయాడు. అప్పుడు బ్యాట‌ర్‌గా వ‌చ్చిన రాహుల్ ఈ సారి వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

KL Rahul

KL Rahul

జ‌ట్టు కోసం ఏ విధ‌మైన పాత్ర పోషించేందుకైనా సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో కేఎల్ రాహుల్ తెలిపాడు. గ‌తేడాది రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ కోలుకుని వ‌చ్చేంత వ‌ర‌కు వికెట్ కీప‌ర్ బాధ్య‌త‌ల‌ను రాహుల్ నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉంది. ఈక్ర‌మంలో టెస్టుల్లో పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్న రాహుల్ ఈ సిరీస్‌లో త‌న బ్యాటింగ్ ఫామ్‌ను అందుకోవాల‌ని భావిస్తున్నాడు. అయితే.. మ‌రో యువ వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ వ్య‌క్తిగత కార‌ణాల‌తో ఈ సిరీస్ నుంచి త‌ప్పుకోవ‌డంతో స్పెష‌లిస్టు వికెట్ కీప‌ర్ అయిన కేఎస్ భ‌ర‌త్‌ను అవ‌కాశం ద‌క్కింది.

ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో దృష్టిలో ఉంచుకుని స్పెష‌లిస్టు వికెట్ కీప‌ర్ అయిన కేఎస్ భ‌ర‌త్‌కు అవ‌కాశం ఇస్తారా..? లేదంటే బ్యాటింగ్ విభాగాన్ని బ‌లోపేతం చేయాల‌ని భావిస్తే మాత్రం కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపింగ్ చేయ‌మ‌ని కోర‌తారా..? అన్న సంగ‌తి చూడాల్సిందే.