వేలంలో అన్‌సోల్డ్.. శార్దూల్ జీవితాన్ని మలుపు తిప్పిన జహీర్ ఖాన్ ఫోన్ కాల్..
ఐపీఎల్‌లో తనను ఎవ్వరూ తీసుకోకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని శార్దూల్ భావించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్ పేరు మారుమోగిపోతుంది. ఈ సీజన్‌లో ప్రస్తుతం అతడి వద్దే పర్పుల్ క్యాప్ ఉంది. వాస్తవానికి అతడు ఈ సీజన్‌లో ఆడతాడని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే మెగావేలం 2025లో అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రెండు సార్లు అతడి పేరు వేలంలో వచ్చినా కూడా ఏ జట్టు కూడా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు.
ఐపీఎల్‌లో తనను ఎవ్వరూ తీసుకోకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని శార్దూల్ భావించాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టు ఎసెక్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అయితే.. అసలు కథ అప్పుడే ప్రారంభమైంది. తానేంటో దేశవాళీ టోర్నీలు అయిన.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీట్రోఫీలో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు.
MS Dhoni : చెన్నై మ్యాచ్ ఓడిపోయినా.. చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఒకే ఒక సీఎస్‌కే ఆటగాడు
ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ముంబై తరుపున మ్యాచ్ ఆడుతున్నప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ నుంచి శార్దూల్ ఠాకూర్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తనను రీప్లేస్మెంట్‌గా తీసుకుంటామని, ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలనేది సదరు ఫోన్ కాల్ సారాంశం.
అతడు గాయపడడంతో..
దీంతో ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభానికి ముందు లక్నో జట్టు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లలో శార్దూల్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు లక్నోకు ఆడతాడనే వార్తలు వచ్చాయి. మోసిన్ ఖాన్ గాయంతో దూరం కావడంతో అతడి స్థానంలో శార్దూల్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో లక్నో తీసుకుంది.
ఆల్‌రౌండర్ కావడంతో తొలి మ్యాచ్‌లోనే శార్దూల్ కు తుది జట్టులో చోటు దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై రెండు వికెట్లు తీసిన శార్దూల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ పై 4 వికెట్లతో సత్తా చాటాడు. మొత్తం ఆరు వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
CSK vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ వింత వ్యాఖ్యలు.. సంతోషంగా ఉంది..
దీంతో ప్రస్తుతం అతడి పేరు ఐపీఎల్ 2025లో మారుమోగుతోంది. అన్‌సోల్డ్‌గా మిగిలి పోయిన ఓ ఆటగాడు తన వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల ఒడిసిపట్టుకున్నాడు. ఇదే సమయంలో టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతడు ఇదే నిలకడను కొనసాగిస్తే.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.