సిరీస్ గెలిచినా.. కోహ్లీ అసంతృప్తికి కారణం ఇదే..

Virat Kohli Surprised At Bhuvi Missing Man Of The Series Title
బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠలో.. భారత బౌలర్లకు చమటలు పట్టించిన ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ శామ్ కరన్. ఒత్తిడి తట్టుకుని అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టింది కోహ్లీసేన. చివరి వన్డేలో ఆల్‌రౌండ్ ఫర్మామెన్స్‌తో భారత జట్టు గెలుపు కైవసం చేసుకుంది. టెస్టుల్లో రికార్డులు, టీ20లో ఉత్కంఠ.. వన్డేల్లో హిట్టింగ్‌తో పర్యాటక ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది భారత్. మూడు ఫార్మాట్లలలో విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది.
ఇంగ్లాండ్‌పై టెస్టు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా… వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో రాణించింది. ఉత్కంఠభరితంగా సాగిన డిసైడింగ్ మ్యాచ్‌లో కోహ్లీసేన.. ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలిత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
శిఖర్ ధావన్, రిషబ్ పంత్, హర్థిక్ పాండ్యా అద్బుత హాఫ్ సెంచరీతో రాణించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ, చివర్లో శార్దుల్ ఠాకూర్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు వికెట్లు తీశాడు.. ఆదిల్ రషీద్ రెండు కీలకమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 322 పరుగులే చేయగలిగింది. డెవిడ్ మలన్ అర్థసెంచరీతో రాణించాడు. బెన్ స్టోక్స్ 35, లియామ్ లివింగ్ స్టోన్ 36 పరుగులతో మినహా ఎవరూ చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. చివర్లో ఆల్‌రౌండర్ సామ్ కరణ్ పోరాడాడు. ఒంటరిగా పోరాడి ఇంగ్లాండ్‌ను గెలిపించినంత పనిచేశాడు.
చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా… నటరాజన్ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు. టీమిండియా బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3, నటరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా శామ్ కరణ్‌ను ఎంపిక చేయగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా సిరీస్ మొత్తంలో 219 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టోను ఎంపిక చేశారు.
అవార్డుల ఎంపిక విషయంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరీస్ మొత్తం నిలకడగా రాణించిన భువనేశ్వర్ కుమార్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఆఖరి వన్డేలో అధ్భుతంగా కీలకమైన వికెట్లు తీసిన శార్దూల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. భువీ 3 వన్డేల్లో 22.50 సగటు, 4.65 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. లాస్ట్ మ్యాచ్‌లో శార్ధూల్ నాలుగు వికెట్లు తీశాడు.