Champions Trophy : ప్రెజెంటేషన్ సెర్మనీ పై పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు..
ఓ విషయం పై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.

Wasim Akram baffled by zero representation of hosts in Champions Trophy 2025 presentation ceremony
ఛాంపియన్స్ ట్రోఫీని మూడోసారి భారత్ ముద్దాడింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన పైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో 12 ఏళ్ల విరామం తరువాత ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. భారత జట్టు విజయం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. ఓ విషయం పై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే.. భద్రతాకారణాల దృష్ట్యా పాక్ కు జట్టును పంపం అని బీసీసీఐ తెలియజేయడంతో భారత జట్టు మ్యాచ్‌లు అన్ని దుబాయ్ వేదికగానే జరిగాయి. టీమ్ఇండియా ఫైనల్‌కు చేరుకోవడంతో లాహోర్ వేదికగా జరగాల్సిన తుది పోరు దుబాయ్ వేదికగానే నిర్వహించారు.
ఈ మెగాటోర్నీలో పాక్ పేలవ ప్రదర్శన చేసింది. సెమీస్‌కు చేరకుండానే గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్కమించింది. ఆజట్టు ప్రదర్శన పై ఇప్పటికే ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహంతో ఉండగా.. తాజాగా ఫైనల్ మ్యాచ్ తరువాత ట్రోఫీ ప్రెజంటేషన్ కార్యక్రమంపై సైతం గుర్రుగా ఉన్నారు.
టీమ్ఇండియా విజయం సాధించడంతో ఐసీసీ ఛైర్మన్ జై షా ఛాంపియన్స్ ట్రోఫీని కెప్టెన్ రోహిత్ శర్మకు అందించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా ప్లేయర్లకు మెడల్స్, జాకెట్స్ అందించారు. కివీస్ జట్టుకు సంబంధించి రోజెర్ ట్వోస్ వేదిక పై ఉన్నారు. అయితే.. ఆతిథ్య పాక్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రెజంటేషన్ సెర్మనీ వేదిక పై లేరు. ఇప్పటికే ఈ విషయం మాజీ ఆటగాడు షోబయ్ అక్తర్ మండిపడగా.. వసీం అక్రమ్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రెజంటేషన్ సెర్మనీ వేదికపై ఆతిథ్య పాకిస్తాన్ తరుపున ఎవరైన ఉండి ఉండాల్సింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే.. పీసీబీ నుంచి సుమైర్ అహ్మద్, ఉస్మాన్ వాహ్లా ఇదరు దుబాయ్‌లోనే ఉన్నారు. అయితే.. వారిద్దరు వేదికపై ఎందుకు లేరు అని ప్రశ్నించారు. పీసీబీ ఛైర్మన్ రాకపోతే పాక్ తరుపున ప్రాతినిథ్యం కోసం ఇంకెవరినైనా పిలవాల్సిందని అక్రమ్ అభిప్రాయపడ్డారు.