Best Fielder Medal : కోహ్లీ కానే కాదు.. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్, జడేజాలలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందుకుంది ఎవరంటే?
ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరు గెలుచుకున్నారంటే..

PIC CREDIT @BCCI
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ముచ్చటగా మూడోసారి టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై అద్భుతంగా ఫీల్డింగ్ చేసి.. ఎవరు బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందుకున్నారో అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది.
ఈ మ్యాచ్‌లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్ (63; 101 బంతుల్లో 3 ఫోర్లు), బ్రాస్‌వెల్ (53 నాటౌట్; 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, షమీలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵 | #Final
For one final time in the #ChampionsTrophy 🏆
The winner of the fielding medal goes to 🥁
WATCH 🎥🔽 #TeamIndia | #INDvNZ
— BCCI (@BCCI) March 10, 2025
అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, శ్రేయస్ అయ్యర్ (48; 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (34 నాటౌట్; 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికంటే?
భారత టీమ్‌మేనేజ్‌మెంట్.. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 నుంచి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను తీసుకువచ్చింది. మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డింగ్ చేసిన ఆటగాడిని గుర్తించి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందిస్తూ వస్తోంది. ఇక ఈ సంప్రదాయాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ కొనసాగిస్తోంది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, పాక్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మెడల్, న్యూజిలాండ్‌తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, సెమీస్‌లో ఆసీస్ పై శ్రేయస్ అయ్యర్ లు బెస్ట్ ఫీల్డర్ మెడల్స్ అందుకున్నారు. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మలు కంటెడర్లుగా నిలిచారు.
వీరిలో రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను గెలుచుకున్నారు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చేతుల మీదుగా జడ్డూ ఈ మెడల్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.