Shubman Gill: శుభమన్ గిల్, విరాట్ కోహ్లి సెంచరీ మిస్
ప్రపంచకప్ లో తొలి సెంచరీకి చేరువగా వచ్చి 8 పరుగుల దూరంలో శుభమన్ గిల్ అవుటయ్యాడు. 49వ సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి కూడా కొద్దిలో మిస్సయ్యాడు.

Shubman Gill Virat Kohli miss out on centuries vs Sri Lanka
Virat Kohli Missed 49th ODI Century: టీమిండియా యువ బ్యాట్స్ మన్ శుభమన్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కొద్దిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు. శుభమన్ గిల్ 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ మొదట నెమ్మదిగా ఆడి తర్వాత గేర్ మార్చాడు. రోహిత్ శర్మ(4) త్వరగా అవుట్ కావడంతో వికెట్ కాపాడుకోవడానికి మొదట ప్రాధాన్యం ఇచ్చాడు. క్రీజ్ లో కుదురుకున్నాక విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఆరంభంలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గిల్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెంచరీకి చేరువగా వచ్చాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ లో రెండో హాఫ్ సెంచరీ కొట్టి.. తొలి శతకం దిశగా పయనించాడు. చివరకు 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి దిల్షాన్ మధుశంక బౌలింగ్ లో కుశాల్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. సెంచరీకి దగ్గర వచ్చి అవుట్ కావడంతో గిల్ నిరాశగా మైదానాన్ని వీడాడు.
విరాట్ కోహ్లి కూడా..
సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తాడకున్న కోహ్లి కూడా సెంచరీకి చేరువలో అవుటయ్యాడు. ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 190 పరుగులు దాటించారు. జట్టు స్కోరు 193 పరుగుల వద్ద గిల్ అవుటయ్యాడు. తర్వాత కాసేపటికే కోహ్లి కూడా పెవిలియన్ కు చేరాడు. 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి మధుశంక బౌలింగ్ లోనే అవుటయ్యాడు. సెంచరీకి చేరువగా కోహ్లి అవుట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు.
Also Read: విరాట్ కోహ్లి రికార్డుల వేట.. సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్
గిల్ ఘనత
అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన నాటి నుంచే సత్తా చాటుతున్న శుభమన్ గిల్ మరో ఘనత సాధించాడు. 2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ రోజు మ్యాచ్ లో 92 పరుగులు చేసిన గిల్ ఈ ఏడాది 1400 పరుగుల మైలురాయిని దాటేశాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పటివరకు ఓవరాల్ గా 40 వన్డేలు ఆడి 2113 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 6 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.