Wrestlers Protest: అందుకే మేమంతా సైలెంట్ అయిపోయాం: రెజ్లర్ సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవర్త్
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ను మార్చేసిందంటూ సంచలన విషయాలు తెలిపారు.

Wrestlers Satyawart Kadian, Sakshi Malik
Wrestlers Protest – Sakshi Malik: రెజ్లర్లు తాము చేస్తోన్న పోరాటంపై సైలెంట్ అయిపోతున్నారు. దీనిపై సాక్షి మాలిక్ తో పాటు ఆమె భర్త, రెజ్లర్ సత్యవర్త్ కడియాన్ (Satyawart Kadian) స్పందించారు. తాము పోరాటం చేస్తోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) అకృత్యాలకు వ్యతిరేకంగా చేస్తున్నామని అన్నారు.
ఇవాళ సాక్షిమాలిక్, సత్యవర్త్ కడియాన్ వీడియో రూపంలో మాట్లాడారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఆందోళన విరమించబోమని రెజ్లర్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజులుగా వారు సైలెంగ్ గా ఉన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఓ మైనర్ రెజ్లర్ తో పాటు మరో ఆరుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై సాక్షి మాలిక్, సత్యవర్త్ స్పందించారు. ” మాలో ఐక్యత లోపించింది. అందుకే చాలా రోజులుగా మేము మౌనంగా ఉన్నాం. మేము ఎప్పటికీ ఐక్యతను సాధించలేం. మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ను మార్చేసింది. ఆమె కుటుంబానికి బెదిరింపులు వస్తుండడమే ఇందుకు కారణం ” అని సాక్షిమాలిక్ చెప్పారు.
రెజ్లర్ల ఆందోళన వెనుక కాంగ్రెస్ ఉందని కొందరు అంటున్నారని, అది నిజం కాదని సత్యవర్త్ అన్నారు. ” జనవరిలో జంతర్ మంతర్ వద్ద మా ఆందోళన కోసం అనుమతులను ఇద్దరు బీజేపీ నేతలు త్రినాథ్ రానా, బబితా ఫొగట్ తీసుకున్నారు. మరి మా కాంగ్రెసే మాతో నిరసన చేయిస్తోందని ఎలా చెబుతారు? ” అని అన్నారు.
” రెజ్లర్లు, కోచ్ లతో పాటు రెజ్లింగ్ కు చెందిన మరో 90 శాతం మందికి లైంగిక వేధింపుల గురించి తెలుసు. గత 10-12 ఏళ్ల నుంచి మహిళా రెజ్లర్లు వేధింపులు ఎదుర్కొంటున్నారని వారికి తెలుసు. ఎవరైనా దీనిపై మాట్లాడితే ఆ విషయం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ వద్దకు వెళ్తుంది. ఇక ఆ రెజ్లర్లు కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ” అని చెప్పారు. కాగా, ఇక రెజ్లర్ల ఉద్యమం నీరుగారిపోయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది.
The Truth.#WrestlersProtest pic.twitter.com/eWHRpOSwD9
— Sakshee Malikkh (@SakshiMalik) June 17, 2023