Virat Kohli: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పలు రికార్డులపై విరాట్ కోహ్లి కన్ను.. అవేంటంటే..?
లండన్‌లోని ఓవల్ వేదికగా రేపటి(జూన్ 7 బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) పైనే ఉంది.

Virat Kohli
Virat Kohli-WTC Final: లండన్‌లోని ఓవల్ వేదికగా రేపటి(జూన్ 7 బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) పైనే ఉంది. ఆస్ట్రేలియాతో ఆడడం అంటే కోహ్లికి చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఆసీస్‌తో 24 టెస్టులు ఆడిన కోహ్లి 48.26 సగటుతో 1,979 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 186.
అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియాతో 92 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 50.97 సగటుతో 4,945 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. ఆసీస్ అంటేనే రెచ్చిపోయే విరాట్ కోహ్లి ముందు ఇప్పుడు అద్భుత అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో గనుక కోహ్లి రాణిస్తే పలు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
మరో 38 పరుగులు చేస్తే
విరాట్ ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్స్‌లో 15 నాకౌట్ మ్యాచులు ఆడాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 51.66 సగటుతో 620 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 96. కాగా.. సచిన్ టెండూల్కర్ 657 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లి మరో 38 పరుగులు చేస్తే సచిన్ రికార్డును బద్దలు కొడుతాడు. ప్రస్తుతం కోహ్లి ఉన్న ఫామ్‌ను చూసుకుంటే ఇదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా
ఇంగ్లాండ్ అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 46 మ్యాచుల్లో 55.10 సగటుతో 2,645 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు, 15 అర్ధశతకాలు ఉన్నాయి. ఆ తరువాత సచిన్ 43 మ్యాచుల్లో ఏడు సెంచరీలు, 12 అర్ధశతకాలతో 2,626 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తరువాత విరాట్ 56 మ్యాచుల్లో మూడు సెంచరీలు, 18 అర్ధశతకాలతో 40.85 సగటుతో 2,574 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ మరో 72 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌లో అత్యదిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలవనున్నాడు.
టెస్టు క్రికెట్‌లో 950 ఫోర్లు
టెస్టు ఫార్మాట్‌లో విరాట్ ప్రస్తుతం 941 ఫోర్లు కొట్టాడు. 950 మార్క్‌ను తాకాలంటే మరో తొమ్మిది ఫోర్లు కొట్టాలి. టెస్టు క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 2,058 ఫోర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అత్యంత వేగంగా 76 సెంచరీలు
విరాట్ కోహ్లి ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 75 శతకాలు చేశాడు. రేపటి ఫైనల్ మ్యాచ్‌లో శతకం చేస్తే ఇది విరాట్‌కు 76వ సెంచరీ కానుంది. సచిన్ కు 76 సెంచరీలు చేసేందుకు 587 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. విరాట్‌కు ఇది 555 ఇన్నింగ్సే.
సౌరవ్ గంగూలీ తర్వాత ఐసీసీ ఫైనల్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడు
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2000 ఫైనల్‌లో గంగూలీ భారతదేశం తరపున సెంచరీ సాధించాడు. అప్పటి నుండి ICC టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఏ ఇండియన్ క్రికెటర్ కూడా సెంచరీ కొట్టలేకపోయాడు. రేపటి మ్యాచ్‌లో విరాట్ శతకం చేస్తే గంగూలీ తరువాత నిలవనున్నాడు.