WTC Final 2025 : ఓటమి దిశగా పయనిస్తున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాచ్ నుంచి కీలక ప్లేయర్ ఔట్..
వరుసగా రెండో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలవాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.

WTC Final 2025 SA vs AUS Big Injury Scare For Australia As Steve Smith Sent To Hospital
వరుసగా రెండో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలవాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి దిశగా పయనిస్తోంది. సఫారీ కెప్టెన్ బవుమా విలువైన ఇన్నింగ్స్‌తో పాటు ఓపెనర్ మార్‌క్రమ్ చిరస్మరణీయ శతకంతో దక్షిణాఫ్రికా గెలుపు ముంగిట నిలిచింది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలవడం దాదాపుగా అసాధ్యం.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్‌కు 74 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా 207 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుంటే దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యం నిలిచింది.
ENG vs IND : భారత్ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాహుల్, గిల్, జడేజా..
282 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమాయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఐడెన్ మార్‌క్రమ్ (102), కెప్టెన్ టెంబా బవుమా (65) లు క్రీజులో ఉన్నారు. చరిత్రాత్మక విజయం సాధించడానికి సఫారీ జట్టుకు మరో 69 పరుగులు అవసరం. ఆసీస్ గెలవాలంటే 8 వికెట్లు తీయాలి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయం.
గాయపడ్డ స్టీవ్ స్మిత్..
మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. స్టార్క్ బౌలింగ్‌లో బవుమా ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతడికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో చాలా క్యాచ్‌లు స్లిప్‌లకు ముందే పడడంతో ఆసీస్ కెప్టెన్ కమిన్స్.. స్మిత్‌ను తొలి స్లిప్‌లో కాస్త ముందు ఉంచాడు.
స్టార్క్ 140 కి.మీ వేగంతో వేసిన బంతి బవుమా బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్స్ వైపుగా వచ్చింది. ఈ బంతిని పట్టుకునే క్రమంలో స్మిత్ చిటికెన వేలికి బంతి బలంగా తాకింది. స్మిత్ బాధతో విలవిలలాడాడు. వెంటనే అతడు మైదానాన్ని వీడాడు. జట్టు సహాయక సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు. కాగా.. అతడి గాయం తీవ్రంగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో అతడు ఇక ఆడడని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.
అసలే ఓటమి దిశగా పయనిస్తున్న ఆసీస్‌కు స్మిత్ గాయం ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.