బౌలింగ్‌ విభాగానికి ఇదో ఛాలెంజ్

బౌలింగ్‌ విభాగానికి ఇదో ఛాలెంజ్

Updated On : November 10, 2019 / 8:11 AM IST

సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ నెలకొంది. భారత్.. బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న మూడో మ్యాచ్ విజయం టైటిల్ ను నిర్ణయించనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ లోనూ యువ ఆటగాళ్లతో అద్భుతం చేయాలని టీమిండియా కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.  ఫైనల్ మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లపై నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. తమ బౌలర్లకు అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమేనని స్పష్టం చేశాడు. 

‘అవును.. మా బౌలర్లకు కాస్త అనుభవం తక్కువ. వాళ్లు నేర్చుకునేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. దేశవాళీ క్రికెట్‌లో ఆడి నేర్చుకోవాలని చెబుతుంటాం. కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేంతవరకు ఒక బౌలర్‌గా ఏస్థాయిలో ఉన్నారో వారికి తెలీదు. మొత్తం బౌలింగ్‌ విభాగానికి ఇదో మంచి ఛాలెంజ్‌’ అని రోహిత్‌ అన్నాడు. 

అలాగే నాగ్‌పూర్‌ పిచ్‌పై స్పందించిన రోహిత్‌ ‘క్రికెట్‌ ఆడటానికి ఇదో మంచి ట్రాక్‌. సరైన దిశలో ఇక్కడ బౌలింగ్‌ చేస్తే.. బౌలర్లకు బాగా సహకరిస్తుంది. రాజ్‌కోట్‌ పిచ్‌ సైతం బౌలర్లకు అనుకూలించి, మరీ ముఖ్యంగా భారత స్పిన్నర్లకు కలిసొచ్చింది. బౌలర్ల వద్ద నైపుణ్యం, వైవిధ్యం ఉంటే పిచ్ ఎలాంటిదైనా.. దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదు’

టీమిండియా ప్రస్తుతం దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌, రాహుల్‌ చాహర్‌లను ఆడిస్తోంది. జట్టు యాజమాన్యం రెండు టీ20ల్లో విఫలమైన ఖలీల్‌కు బదులుగా చివరి మ్యాచ్‌లో శార్దుల్‌ ఠాకుర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపథ్యంలో మూడో టీ20పై ఆసక్తి పెరిగింది.