UPI ID Payments : గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు అలర్ట్.. అతి త్వరలో యూపీఐ ఐడీలను మర్చంట్ సైట్లో సేవ్ చేయొచ్చు..!
UPI ID Payments : ప్రస్తుతం, పేమెంట్ గేట్‌వేలో లావాదేవీల కోసం కార్డ్ వివరాలను టోకెనైజ్డ్ ఫార్మాట్‌లో సేవ్ చేయొచ్చు. యూపీఐ ఐడీలకు కూడా ఇలాంటి ఫీచర్‌ను తీసుకురావాలని NPCI యోచిస్తోంది.

UPI ID Payments
UPI ID Payments : యూపీఐ యూజర్ల కోసం కొత్త ఫీచర్ వచ్చేస్తోంది. భారత్‌లో యూపీఐ చెల్లింపులను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), యూపీఐ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. రాబోయే ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన యూపీఐ ఐడీలను మర్చంట్ వెబ్‌సైట్‌లలో సేవ్ చేసుకోవచ్చు.
తద్వారా ఆన్‌లైన్ లావాదేవీ ప్రక్రియను మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం, కొనుగోలుదారులు ఈ మర్చంట్ సైట్‌లలో చెక్అవుట్ సమయంలో తమకు ఇష్టమైన యూపీఐ యాప్, సంబంధిత బ్యాంక్ అకౌంట్ ఎంచుకోవాలి. యూపీఐ కార్డ్ పేమెంట్స్ కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. యూపీఐ యూజర్లు తమ లావాదేవీల కోసం తమ కార్డ్ వివరాలను టోకనైజ్ కూడా చేయొచ్చు.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం పేమెంట్ గేట్‌వేలను కార్డ్ డేటాను టోకనైజ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ డేటా మర్చంట్ వెబ్‌సైట్‌లలో ఎన్‌క్రిప్ట్ చేసిన ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. వినియోగదారులు ఆన్‌లైన్ కొనుగోలు చేయగానే OTP ఎంటర్ చేయమని అడుగుతుంది.
అదేవిధంగా, యూపీఐ యూజర్లు యూపీఐ ఐడీని మర్చంట్ వెబ్‌సైట్‌లలో సేవ్ చేసేందుకు NPCIకి RBI నుంచి అప్రూవల్ అవసరం. ఒకసారి అప్రూవల్ పొందిన తర్వాత వినియోగదారులు ఇకపై ఆన్‌లైన్ లావాదేవీలు చేసే ప్రతిసారీ వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. తమకు నచ్చిన యూపీఐ యాప్, బ్యాంక్ అకౌంట్ ఎంచుకోవాల్సిన పనిలేదు. ఒకసారి సేవ్ చేస్తే అవసరమైనప్పుడు అదే యూపీఐ ఐడీతో ఈజీగా పేమెంట్లు చేయొచ్చు.