25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి వస్తున్నారు: బాంబు పేల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబు పేల్చారు.

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి వస్తున్నారు: బాంబు పేల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Updated On : April 6, 2024 / 6:09 PM IST

Uttam Kumar Reddy: త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. నిన్న కరీంనగర్ లో కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ మీద లక్షల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు.

”తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెడితే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారు. నీకు తెలివి తక్కువ, పొగరు ఎక్కువ. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వరూ పడరు. ప్రపంచంలో నువ్వొక్కడివే మేధావివా? మేడిగడ్డ కుంగింది అన్నప్పుడు ఎడా పన్నావ్. మాకు అభివృద్ధి చేయడం తెలుసు, నీకు కమిషన్లు తీసుకోవడం తెలుసు. రైతులు ప్రస్తుతం ఇబ్బందులు పడడానికి కేసీఆరే కారకుడు. వ్యక్తిగత లాభం కోసం కృష్ణా, సాగర్ జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు. ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ రోజు నీటి సమస్య వచ్చింది. కేసీఆర్ తీసుకొచ్చిన కరువు ఇది. ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు, వ్యవసాయానికి ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు. రైతుల ఇబ్బందులను తగ్గించడానికి, ప్రజల మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటున్నాం.

కేసీఆర్ పాలనలో ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా డిజైన్ చేయలేదు. బ్యారేజీలకు, డ్యామ్ లకు తేడా తెలియని వ్యక్తి కేసీఆర్. లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. చిన్న చిన్న తప్పులు అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతి సంవత్సరం 17 వేల కోట్లు అప్పు కట్టాల్సి వస్తోంది. కేసీఆర్ అన్ని అసత్యాలే మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు నమ్మొద్దు. నష్టపోయిన ప్రతి రైతుకు మా సానుభూతి, నష్టపరిహారం ఉంటుంద”ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Also Read: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: మంత్రి పొన్నం
కేసీఆర్ అసహ్యమైన భాష చూస్తుంటే సిగ్గుగా వుందని, అసహనంతో ఆయన మాట్లాడుతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ”చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ అయిన నెరవేర్చడేమో కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము మిమ్మల్ని తొక్కుతామో, మీరు మమ్మల్ని తొక్కుతామో చూసుకుందాం. అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం. కేసీఆర్ వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల”ని మంత్రి పొన్నం హెచ్చరించారు.

Also Read: తెలంగాణలో మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు

కేసీఆర్‌పై మంత్రి జూపల్లి ధ్వజం
మిషన్ భగీరథలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఎక్సైజ్, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ”పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్.. పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చి కేవలం నాలుగు నెలలు అయింది, వాళ్ళు పదేళ్లు అధికారంలో ఉన్నారు. కేసీఆర్ చవట, దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని ఎలా లక్షల కోట్ల అప్పులు చేసారు. 2014 నుంచి మొన్నటి వరకు నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదు. పెన్షన్ 4 వేలు చేస్తామని హామీయిచ్చాం, త్వరలో ఇవ్వబోతున్నాం. పంట నష్టంపై మాట్లాడుతున్న నువ్వు ఆనాడు ఎందుకు ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పంట నష్టం ఇచ్చింది. కరువు వచ్చిన రైతులను ఆదుకుంది. గద్దలాగా వాలుతాం అన్న నీవూ, నీ కుటుంబం ఇప్పటికే గద్దల్లాగా తినేశారు. గతంలో కుర్చీ వేసుకొని చేయిస్తా అని చాలా హామీలు ఇచ్చావ్. మల్లి కొత్తగా అదే పాట పడుతున్నావ్” అంటూ దుయ్యబట్టారు.