BC Quota: రేపే.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు..
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది.

BC Quota: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. రేపు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. హస్తినలో సీనియర్ న్యాయవాదులను కలవబోతున్నారు. న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించేలా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపిస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవో ఇవ్వడం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, ఆర్డినెన్స్ తీసుకు రావడం వంటి పరిణామాలు జరిగాయి. స్థానిక సంస్థలకు సంబంధించి జీవో నెంబర్ 9 కూడా ఇవ్వడం జరిగింది. 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ కేసులు వేశారు. దీనిపై రేపు వాదనలు వింటామని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ క్రమంలో దీనిపై అఫిడవిట్ దాఖలు చేసి బలమైన వాదనలు వినిపించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
రేపు సుప్రీంకోర్టులో తమ వాదనలను బలంగా వినిపించాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. 42శాతం రిజర్వేషన్లు ప్రకటించడానికి కారణాలు ఏంటి అనేది న్యాయవాదులకు వివరించి, వారి ద్వారా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ఆలోచన చేస్తోంది.
గతంలో బిహార్ లో రిజర్వేషన్ల పెంపుదలను సుప్రీంకోర్టు కొట్టివేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టే 50శాతం క్యాప్ విధించింది కాబట్టి క్యాప్ ను అధిగమించి తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు వింటామని అత్యున్నన న్యాయస్థానం తెలిపింది.
Also Read: మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు మూతబడితే? మీ డబ్బులన్నీ తిరిగివస్తాయా? ఏం జరుగుతుంది?