Mahabubabad: లారీపై నుంచి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి.. ఆటోలోని ముగ్గురు ప్రయాణికులు మృతి
ఈ ఘటన శనివారం సాయంత్రం కురవి మండలం, అయ్యగారిపల్లి వద్ద రహదారిపై జరిగింది. గ్రానైట్ రాయితో లారీ వెళ్తుండగా, అది జారి కింద పడిపోయింది. ఆ రాయి దొర్లుకుంటూ వెళ్లి, వెనకాల వస్తున్న ఆటోపై పడింది.

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాయి లోడ్‌తో వెళ్తున్న లారీ పై నుంచి రాయి జారి ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం కురవి మండలం, అయ్యగారిపల్లి వద్ద రహదారిపై జరిగింది. గ్రానైట్ రాయితో లారీ వెళ్తుండగా, అది జారి కింద పడిపోయింది.
ఆ రాయి దొర్లుకుంటూ వెళ్లి, వెనకాల వస్తున్న ఆటోపై పడింది. దీంతో ఆటోలోని ముగ్గురు అక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఆటోలోని మిగతావాళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రాయి భారీ సైజులో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఆటోలోని ప్రయాణికులంతా కూలీలే. వీళ్లు స్థానిక మంగోరి గూడెంకు చెందిన వాళ్లు. కూలీ పనులకు వెళ్లి, ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.