ఏపీ, తెలంగాణ మధ్య విభజన పంచాయితీ తేలేనా? ఇన్నాళ్లు ఏం జరిగిందో తెలుసా?

ఏపీ సర్కార్ పరిపాలనను అమరావతికి మార్చుకోవడంతో.. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఇవ్వాలని..

ఏపీ, తెలంగాణ మధ్య విభజన పంచాయితీ తేలేనా? ఇన్నాళ్లు ఏం జరిగిందో తెలుసా?

AP TG issues

తెగని పంచాయితీ, ఒడవని ముచ్చట.. కోర్టు కేసులు, కేంద్రం దగ్గర పంచాయితీలు.. పదేళ్లు అయినా తెలంగాణ, ఏపీ మధ్య పరిష్కారం కాని సమస్యలు ఎన్నో. విభజన జరిగిన మొదటి ఐదేళ్లు రాజ్‌భవన్ కేంద్రంగా గవర్నర్ సమక్షంలో చర్చలు జరిగాయి. అయినా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. తర్వాత ఐదేళ్లు అసలు చర్చలే జరగలేదు. పట్టించుకోలేదు.

ఇప్పుడు విభజన చట్టానికి పదేళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తి అయింది. ఇప్పుడు ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ప్రభుత్వాలు మారాయి. కొత్త సీఎంలు విభజన సమస్యలను పరిష్కారం కోసం ఓ అడుగు ముందుకేస్తున్నారు. సామరస్యంగా వివాదాలు కొలిక్కి తెచ్చుకునేందుకు చర్చల ప్రాసెస్‌ను మొదలుపెట్టారు.

రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రులు మారారు. విభజన తర్వాత ఏపీలో ఫస్ట్ టర్మ్‌లో చంద్రబాబు, సెకండ్ టర్మ్‌లో జగన్.. తెలంగాణలో రెండు టర్మ్‌లు కేసీఆర్ సీఎంగా ఉన్నా..ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదు. విభజన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆస్తుల విభజన, విద్యుత్‌ బిల్లుల బకాయిలు వంటి సమస్యలు కొలిక్కి రావడం లేదు. విభజన సమస్యల పరిష్కారం అంత సులువు కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్‌.

పట్టువిడుపులు అవసరం
అందుకే పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలుగానే మిగిలిపోయాయని.. పట్టువిడుపులు అవసరమని చెబుతున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా విభజన సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన ఇష్యూలో ఎలాంటి నిర్ణయంతో ఓ స్టెప్ ముందుకేసినా రాజకీయంగా నష్టం జరుగుతుందని ఏపీ, తెలంగాణ లీడర్లు నాన్చుతూ వస్తున్నారు.

వాస్తవానికి ఏ ఒక్క రాష్ట్రం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకపోయినా విభజన సమస్యలు కొలిక్కి రావడం అనేది కుదరని పని. రెండు రాష్ట్రాలు తగ్గేదేలే అంటే.. తెగేదాక లాగే పరిస్థితి వస్తుంది. కొన్ని విషయాల్లో ఏపీ, మరికొన్ని అంశాల్లో తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే పద్దతిలో వెళ్తేనే వివాదాలు ఈజీగా సాల్వ్‌ అయ్యే అవకాశం ఉంది.

రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. విభజన చట్టంలోని 9, పదో షెడ్యూలే కాదు.. ఏ షెడ్యూల్‌లో లేని మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని ఏపీ అడుగుతోంది. అందుకు తెలంగాణ ఒప్పుకోవడం లేదు.

వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్నాయి. చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌ ఉన్నాయి.

విభజన తర్వాత కమిటీ
విభజన తర్వాత రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ ఎక్స్‌పర్ట్స్‌ టీమ్ షెడ్యూల్ 9,10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేశాయి. వాళ్లు సూచించిన అంశాలు కూడా ఇప్పటికీ పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. విద్యుత్ సప్లైకి సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ముందుకు సాగలేదు. అలాగే ఆర్టీసీ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరితే, తెలంగాణ ఆర్టీసీ అందుకు ఒప్పుకోవడం లేదు. 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు తెలుస్తోంది. విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో దాదాపు 8వేల కోట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి రెండు ప్రభుత్వాలు.. చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని ఆ నిధులను వాడుకోవాలని ఏపీ, తెలంగాణ సర్కార్ భావిస్తున్నాయి.

హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని.. తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తారని గత తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌పై కూడా ఇన్నాళ్లు వివాదం కొనసాగింది. ఈ మధ్యే కేంద్రం రెండు రాష్ట్రాలకు భూకేటాయింపులు చేయడంతో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌పై వివాదం ముగిసింది. విభజన చట్టం ఆధారంగా 58:42 ప్రకారం రెండు రాష్ట్రాలు భవన్ ఆస్తులు పంచుకున్నాయి.

ఇప్పటికీ తేలలేదు
పరిష్కారం కోసం వేచి చూస్తున్న సమస్యల్లో ఉద్యోగుల బదిలీ అంశం ఇప్పటికీ తేలలేదు. ఏపీకి కేటాయించిన 144మంది తెలంగాణ ఉద్యోగులు ఇంకా అక్కడే పనిచేస్తున్నారు. తమను తెలంగాణకు పంపాలనేది వారి డిమాండ్‌.. కేసీఆర్‌ సీఎంగా ఉన్న పదేళ్లతో పాటు ఇప్పుటి ప్రభుత్వానికి కూడా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తులు, వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఐనా వాళ్ల అప్పీల్‌ పెండింగ్‌లో ఉంది.

ఏపీ సర్కార్ పరిపాలనను అమరావతికి మార్చుకోవడంతో.. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఇవ్వాలని కేసీఆర్ ఒత్తిడి చేశారు. దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. జగన్ వచ్చాక ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇచ్చేశారు. అన్ని సమస్యలూ ఒకేసారి పరిష్కరించుకుందామని కేసీఆర్ అప్పట్లో ప్రపోజల్ పెట్టారు.

తర్వాత 2019లో ఏపీలో ప్రభుత్వం మారంది. జగన్ సీఎం అయ్యారు. అప్పటికే తెలంగాణలో కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరైన కేసీఆర్‌.. బేసిన్లు, బేషజాలు ఉండవని ప్రకటించారు. దీంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక్క విభజన సమస్యపైనా చర్చ జరగలేదు. రాజకీయంగా కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ విభజన సమస్యలపై చర్చించేందుకు ఇద్దరు ఆసక్తి చూపలేదు.

చంద్రబాబు అందుకే ఢిల్లీలో పర్యటించారు: కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు