Nalgonda Politics : గులాబీ మళ్లీ గుబాలిస్తుందా? కమలం వికసిస్తుందా? నల్గొండ ట్రయాంగిల్‌ ఫైట్‌లో గెలుపెవరిది?

Triangle Fight In Nalgonda : ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడిన నేలపై హస్తం హవా నడుస్తుందా? కమలం వికసిస్తుందా? అభివృద్ధే ప్రచార అస్త్రంగా దూసుకెళ్తున్న గులాబీ పార్టీ మళ్లీ గుబాలిస్తుందా?

Nalgonda Politics : గులాబీ మళ్లీ గుబాలిస్తుందా? కమలం వికసిస్తుందా? నల్గొండ ట్రయాంగిల్‌ ఫైట్‌లో గెలుపెవరిది?

Triangle Fight In Nalgonda

రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులు. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు. డిసెంబర్‌ 3న విజయఢంకా మోగిస్తామన్న సవాళ్లు. వీటన్నింటితో రంజుగా మారిన రాజకీయం. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు “నీకు నాకు సై” అంటున్నారు.

గులాబీ పార్టీ మళ్లీ గుబాలిస్తుందా?
పోరాటల ఖిల్లా నల్లగొండ గడ్డపై ఎవరి జెండా ఎగురనుంది. ఎవరి వ్యూహం ఫలించనుంది. ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడిన నేలపై హస్తం హవా నడుస్తుందా? కమలం వికసిస్తుందా? అభివృద్ధే ప్రచార అస్త్రంగా దూసుకెళ్తున్న గులాబీ పార్టీ మళ్లీ గుబాలిస్తుందా? సొంత గడ్డకు సేవ చేసేందుకు మీ బిడ్డనై వస్తున్నానని బీజేపీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ఒక్క రోడ్డు వేసి ఇదే అభివృద్ధి అంటే నమ్మేదెవరని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్‌ అటాక్ చేస్తున్నారు. ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని, ప్రజలు కేసీఆర్‌ వెంటే ఉన్నారని బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి చెబుతున్నారు. మరి నల్గొండ ట్రయాంగిల్‌ ఫైట్‌లో గెలుపెవరిది.?

Also Read : మహేశ్వరంలో ట్రయాంగిల్ ఫైట్.. సబిత ఓటమి ఖాయమంటున్న ప్రత్యర్థులు

ఈసారి కచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఇస్తారు- మాదగోని శ్రీనివాస్ గౌడ్
సొంత గడ్డకు సేవ చేసేందుకు మీ బిడ్డనై వస్తున్నానని బీజేపీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌ అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండను అడుగడుగునా నిర్లక్షం చేసిందంటున్నారు. నల్గొండను దత్తత తీసుకుంటానన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ఆయన నిలదీస్తున్నారు. ప్రభుత్వ పథకాలు గులాబీ పార్టీ కార్యకర్తల ఇంటికే చేరాయని ఆరోపిస్తున్నారు. బరిలో ఉన్న వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి అసమర్థులని నల్గొండకు ఏమీ చేయాలేకపోయారని విమర్శించారు. నల్లగొండ ప్రజలు ఇప్పటివరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ ఇస్తారని తేల్చి చెబుతున్నారు శ్రీనివాస్‌ గౌడ్‌.

రోడ్డు వేస్తే అభివృద్ధి అయిపోనట్టేనా?- కోమటిరెడ్డి
కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు యువకులు, మహిళలు కదిలి వస్తున్నారని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటున్నారు. ఒక్క రోడ్డు వేసి అభివృద్ధి చేశామని బీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ప్రజలకు బాగా తెలుసన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేనే లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మకై ఎన్ని కుట్రలు చేసినా చివరకు గెలిచేది, నిలిచేది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Also Read : మహబూబ్‌నగర్ జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది?

నల్లగొండ గడ్డపై మరోసారి గులాబీ జెండానే ఎగురుతుంది- కంచర్ల భూపాల్ రెడ్డి
నల్లగొండ గడ్డపై మరోసారి గులాబీ జెండానే ఎగురుతుందంటున్నారు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి. 20ఏళ్లలో చేయలేని అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించానని అంటున్నారు. మత్తు కళ్లతో చూస్తే అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆయన కౌంటర్‌ విసిరారు. నూటికి నూరు పాళ్లు బీఆర్‌ఎస్ యే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు చేయలేని ఎన్నో పనులు తాను చేశానని చెబుతున్నారు బీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి.

ఓవైపు హీటెక్కించే విమర్శలు.. మరోవైపు హోరెత్తించేలా ప్రచారాలు.. త్రిముఖ పోటీలో ఎవరికి వారు హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు “నీకు నాకు సై” అంటున్నారు. మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సిందే.