BC Reservations: బీసీ రిజర్వేషన్లు.. తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్.. రేపు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం..
ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు భయపడమన్నారు మహేశ్ కుమార్ గౌడ్.

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది సర్కార్. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై పట్టుదలతో ఉంది రేవంత్ ప్రభుత్వం.
బీసీ రిజర్వేషన్లపై తగ్గేదే లేదన్నారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. రేపు ఢిల్లీకి వెళ్తామని, సుప్రీంకోర్టు తలుపు తడతామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు భయపడమన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
‘ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలకు మేము భయపడం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్ చిత్తశుద్ధి ఏంటో ఇదివరకే చూశారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్, జీవో కూడా ఇచ్చాం. హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల విషయంలో మేము వెనక్కి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు తలుపు తట్టబోతున్నాం. మా ఇద్దరు మంత్రులు, నేను ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిందేనని సీఎం రేవంత్ సూచించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఇతర ఆప్షన్స్ ఏవైనా ఉంటే వాటిని వాడుకుంటాం.
బీసీ బిల్లుకి అడుగడుగునా వ్యతిరేకత పెంచుకుని బీజేపీ మాట్లాడుతోంది. బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి? గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మరి ఎందుకు బిల్లు పెండింగ్ లో ఉంది అని ఒక్కసారైనా బీజేపీ నాయకులు అడిగారా? కేంద్రంలో మీ పార్టీ ఉంది. మీరు ఆ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. ప్రధాని దగ్గరికి వెళ్లి ఎందుకు అడగటం లేదు? ఈ విషయాన్ని బీసీలు గ్రహించలేదని మీరు అనుకుంటున్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ ఆలోచిస్తున్నారు.
మీ చేతిలో ప్రభుత్వం ఉంది. మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మరి ఎందుకు మోదీని అడగటం లేదు? మీ అందరూ తలుచుకుంటే మీతో పాటు మేము కూడా వస్తాం. ఇది ఒకరోజు సమస్య. దీన్ని కావాలని తొక్కిపెట్టారు. బీసీ జనానికి నోటికాడి కూడును తలదన్నుతున్నారు ఈ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ ఆడే డ్రామాలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. ఇద్దరూ కలిసి దీన్ని అడ్డగిస్తున్నారు” అని నిప్పులు చెరిగారు మహేశ్ కుమార్ గౌడ్.
బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే..
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జీవో 9 అమలును నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్లైంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది తెలంగాణ ప్రభుత్వం.