కొత్తగా పెళ్లి అయిన వారికి గృహజ్యోతి రాకపోవడానికి కారణమిదే- మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు విద్యుత్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టి కొచ్చింది. ఆ అధికారులపై చర్యలు తప్పవు.

కొత్తగా పెళ్లి అయిన వారికి గృహజ్యోతి రాకపోవడానికి కారణమిదే- మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka Mallu On Gruha Jyothi

Bhatti Vikramarka Mallu : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా నిన్న 15వేల 623 మెగావాట్ల విద్యుత్ అందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ సరఫరా లో కూడా గతేడాది కంటే ఎక్కువగా చేశామన్నారు. కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? అని తప్పుడు ప్రచారం చేస్తున్న వారు గుర్తించాలన్నారు. ఈ వేసవిలో మరింత డిమాండ్ పెరగనుందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని భట్టి తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మొద్దని, నిశ్చింతగా ఉండాలని ఆయన సూచించారు.

”విద్యుత్ కొనుగోళ్లపై శాఖపరంగా సమగ్రమైన రిపోర్ట్ తీసుకుంటున్నాం. గ్రీన్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణను ఆదర్శంగా నిలిపేలా ప్రభుత్వం పని చేస్తుంది. రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ ను అందుబాటులోకి తెస్తాం. దీని కోసం రిపోర్ట్స్ తీసుకుంటున్నాం. ఇరిగేషన్ కాలువలపైనా సోలార్ పవర్ ఉత్పత్తికి వాడుకుంటాం. గృహ జ్యోతిపై పథకంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు గృహజ్యోతి వర్తిస్తుంది. ప్రజాపాలనలో దరఖాస్తులు సరిగా ఉన్నవారందరికీ గృహజ్యోతి వస్తుంది. అన్నీ సరిగ్గా ఉండి రాని వారు ఎంపీడీవో ఆఫీస్ ను సంప్రదించండి. ప్రతి లబ్దిదారుడికి గృహజ్యోతి అందిస్తాం.

గతంలో రేషన్ కార్డు ఇవ్వని కారణంగానే కొత్తగా పెళ్లి అయిన వారికి గృహజ్యోతి రావడం లేదు. గృహజ్యోతి కింద ఇప్పటివరకు.. 40,33,702 మందికి అందించాం. గృహజ్యోతి కోసం దరఖాస్తు నిరంతరం కొనసాగుతుంది. గత ప్రభుత్వం కొండలు, గుట్టలు ఉన్న బడా బాబులకు కూడా రైతుబంధు ఇచ్చింది. 20వేల కోట్లు ఇచ్చింది. మేము ప్రజల సొమ్ము దుర్వినియోగం కానివ్వం. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం.

ఈ నెల 12న మహిళా గ్రూపులకు జీరో వడ్డీ(వడ్డీ లేని) రుణాల పథకాన్ని అమలు ప్రారంభిస్తాం. ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తాం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం. మా ప్రభుత్వం మహిళలను మహాలక్ష్ములుగా గౌరవిస్తాం. గత ప్రభుత్వం.. ఆశ, అంగన్ వాడీ, ఆయాలకు నెల జీతాలు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం 40వేల కోట్లు పెండింగ్ లో పెట్టింది. రాష్ట్రంలో ఉద్యోగులు అందరికీ మార్చి 1న జీతాలు ఇచ్చాం. బీఆర్ఎస్ కోసం కాదు.. ప్రజల కోసం ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం. ఆరు గ్యారంటీలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు.

ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు విద్యుత్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టి కొచ్చింది. ఆ అధికారులపై చర్యలు తప్పవు. ఐటీఐ కాలేజీల్లో.. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చేందుకు ఎంవోయూ కుదిరింది. టాటా టెక్నాలజీస్ తో ప్రభుత్వం కుదుర్చుకుంది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read : తెలంగాణలో పోటీకి టీడీపీ, జనసేన దూరం.. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి పిలుపు