Bandi Sanjay Kumar : ఆ ఇళ్లు ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయి, అరెస్టులతో అడ్డుకోలేరు-సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఆగ్రహం
అరెస్టులు, గృహ నిర్బందాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం. కేసీఆర్ ఇకనైనా మోనార్క్ బుద్దులు మానుకోవాలి. (Bandi Sanjay Kumar)

Bandi Sanjay Kumar (Photo : Google)
Bandi Sanjay – CM KCR : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కిషన్ రెడ్డి అరెస్టును ఆయన ఖండించారు. కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులపై మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారు అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్ళను అణిచివేస్తున్నారు అని సీరియస్ అయ్యారు.
”కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తప్పేంటి? డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? PMAY కింద ఇచ్చిన ఇళ్ళను పూర్తి చేశాం అని కేంద్రానికి నివేదిక ఇచ్చిన కేసీఆర్.. లబ్ధిదారుల లిస్ట్ ఎందుకివ్వడం లేదని కేంద్రo ప్రశ్నిస్తే ఎందుకు స్పందించడం లేదు?
మీరు కట్టిచ్చిన ఇళ్ళను చూసేందుకే బీజేపీ నాయకులు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ చూపిన గ్రాఫిక్స్ కు, కట్టిన ఇండ్లకు పొంతనే లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నా పాదయాత్రలో సందర్శించా. అవి ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అక్రమ దందాలకు నిలయంగా మారాయి.
అరెస్టులు, గృహ నిర్బందాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం. కేసీఆర్ ఇకనైనా మోనార్క్ బుద్దులు మానుకోవాలి. అరెస్టులు చేసినంత మాత్రాన బీజేపీ వెనక్కి పోదు. ప్రజలు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీల అరెస్టులపై పార్లమెంటులో ప్రివిలేజ్ నోటీసులు కూడా ఇచ్చాము” అని ఎంపీ బండి సంజయ్ అన్నారు.